Monday, December 31, 2007

షేక్ సెబాస్టియన్ నాయుడు (ఫ్యాక్షన్ సినిమా స్టోరీ - 200 డేస్ 200 సెంటర్స్ )


ఉపోద్ఘాతం

' నరకానికి నాలుగు అడుగులు ' దాకా వెళ్ళి ఎలాగో బయటపడ్డాం, సినిమా అయిపోవడం తో. అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయి చాలా రోజులు అయినా మేము సాహసం చేయలేదు. కాకపోతే కనబడ్డ ప్రతి ఒక్కడూ ఇండస్ట్రీ హిట్ అంటేనూ ధైర్యం చేసాం.సినిమా చూసాక నా ఆత్మ విశ్వాసం ఘోరంగా దెబ్బ తింది. అస్సలు అర్థం కాలేదు ఆ సినిమా ఎలా హిట్ అయిందా అని.

ఆ రాత్రి-
" బాసూ ఇక లాభం లేదు, మనలని ' నరకానికి నాలుగు అడుగులు ' దాకా తీసుకెళ్ళిన ఆ డైరెక్టర్ కి బుద్ది చెప్పాల్సిందే " అన్నాడు మా ఫ్రెండ్ .
"బుద్ది కాదు, కథ చెప్పాలి " అన్నాడు మా జూనియర్.

అలా మా విన్నూత్న వైవిధ్య ఫ్యాక్షన్ కథ కి అంకురార్పణ జరిగింది.
*********
కథ
అన్ని ఫ్యాక్షన్ సినిమాల్లాగే మన సినిమా కూడా సీమ లో కాకుండా వేరే చోట (ఈ సారి వెరైటీ గా ఒరిస్సాలో ) మొదలవుతుంది.

సెబాస్టియన్ (హీరో) ఒరిస్సా లో ఒక జిం పెట్టుకుని తన ఆరేళ్ళ కొడుకు తో పాటు వుంటాడు. ఆ జిం లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ కామన్ ట్రైనర్ మన హీరో యే. యాజ్ యూజువల్ హీరోయిన్ కూడా ఇదే జిం. ఒక సారి హీరోయిన్ ఏదో ఎక్సర్సైజ్ చేస్తుంటే (ఆ అమ్మాయి బాగానే చేస్తుంటుంది) హీరో వచ్చి ఇది ఇలాగేనా చేయడం అని క్లాస్ పీకి, అది చేయాల్సింది అలా కాదు ఇలా అని చెప్పి (ఆమె కంటే వరస్ట్ గా ) చేసి చూపిస్తాడు. అపుడు హీరోయిన్ 'వ్వావ్ వ్వాటే పవర్' అని ఆశ్చర్యపడుతుంది. కట్ చేస్తే పాట - స్విట్జర్లాండ్ రోడ్డు మీద -
అ: ఓసి నా చద్దన్నం ముద్దా,
నా పవరంటే నీకంత ముద్దా
ఆ: నువ్వే రా జిం లో ట్రైనరు,
నువ్వే నా సోకులకి ఓనరు ...

అలా రోజు జిం లో చేసే ఎక్సర్సైజు లు నాలుగు రోడ్డు మీద చేసాక పాట అయిపోతుంది.

పాట అయిపోగానే బాగా గుబురు గెడ్డం, మాసిన జుట్టు వున్న పది మంది 'ఒరియా 'రౌడీ లు వచ్చి వెంటనే ఆ ప్లేస్ ఖాళీ చేయమని 'ఈనాడు ఎడిటోరియల్ ' లో వ్రాసే తెలుగు భాష లో హీరో కి వార్నింగ్ ఇస్తారు. వెంటనే ఏ మాత్రం ప్రతిఘటించకుండా హీరో సామాను సర్దుకుంటుంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చి 'ఏం వాళ్ళకు భయపడుతున్నావా, వాళ్ళని ఎదిరించే దమ్ము నీకు లేదా, వొంటి మీద కండలు కాదు మనిషి కి కావలసింది, గుండెల్లో దమ్ము ' అని హీరో ని రెచ్చగొడుతుంది. అయితే హీరో ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ సామాను సర్దుకుంటుంటాడు. ఇంతలో హీరోయిన్ తన అంకుల్, పోలీసాఫీసర్ పట్నయక్ కి కాల్ చేస్తుంది. పట్నయక్ ని చూసి కొయ్యబారిన రౌడీలు క్షమించమని ఆయన కాళ్ళ మీద పడుతుంటే పట్నాయక్ మాత్రం వాళ్ళని వదిలించుకుని వచ్చి హీరో కాళ్ళ మీద పడతాడు. హీరోయిన్ షాక్.
'మీ లాంటి గొప్ప మనిషి...' అని సగం డైలాగు పైకి చెప్పి మిగిలిన సగం లోపల గొణుక్కుంటూ వెళ్ళిపోతాడు. రౌడీలు కూడా వెళ్ళిపోతారు.

హీరోయిన్ మాత్రం హీరో దగ్గరకి వచ్చి, 'నువ్వు మామూలోడివి అయివుండవు, నీకు గ్యారంటీగా ఫ్లాష్ బాక్ వుండే వుంటది, అది నాకు చెప్పు ' అని సతాయిస్తుంది. హీరో ఏమో అదేమీ లేదు అని చెప్పి తప్పించుకుందామని ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ నువ్వు మర్యాదగా ఫ్లాష్ బాక్ అయినా చెప్పు లేదా నా ఈ క్రింది ప్రశ్నలకి సమాధానం అయినా చెప్పు అని నిలదీస్తుంది.(రెండూ ఒకటే!!)
1. ఒరిస్సా ని గడగడలాడించే ఐ.పి.ఎస్. పట్నాయక్ నీ కాళ్ళకి ఎందుకు దణ్ణం పెట్టాడు.
2. నీ ఈ బిడ్డ కి తల్లి ఎవరు. ఆమె ని ఫ్లాష్ బాక్ లో ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపారో క్లుప్తం గా వివరించు.
3. నీ అసలు పేరు ఏంటి. నీకు సెబాస్టియన్ అనే పేరు ఎందుకు కలిగింది.

కట్ చేస్తే కొండ మీద హీరో హీరోయిన్. బ్యాక్ డ్రాప్ లో ఎగిరి వచ్చే అలలు.
ఫ్లాష్ బాక్ స్టార్ట్:

హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఫ్యాక్షనిస్ట్ విలన్స్ చంపేస్తే ఏడేళ్ళ 'శివయ్య నాయుడు ' మాత్రం తప్పించుకుని ఏదో ట్రైన్ ఎక్కి ముంబై పారిపోతాడు. అక్కడ పెరిగి 20 ఏళ్ళయాక ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఒక సాంగ్ కూడా అయాక తెలుస్తుంది ఆ అమ్మాయిది కూడా 'సీమ ' యేనని. సీమ లో ఫ్యాక్షనిస్ట్ ఓబుల్ రెడ్డి (అవును ఓబుల్ రెడ్డి యే) ఆమె మీద కన్నేసి ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తే ఆమె తప్పించుకుని ముంబై వచ్చి వుంటుంది. వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుందామనుకునే టైం కి ఆ అమ్మాయిని ఓబుల్ రెడ్డి కిడ్నాప్ చేసి సీమ కి ఎత్తుకెళతాడు. ఆ అమ్మాయి కోసం హీరో సీమ లోకి ఎంటర్.

హీరో ట్రైన్ దిగి వూళ్ళోకి రాగానే అందరూ ఆశ్చర్యంగా ఆనందం గా వింత గా హీరో నే చూస్తూ వుంటారు. ఇంతలో ఒక ముసలావిడ పరుగెత్తుకుంటూ వచ్చి "శివయ్యా ఇంత కాలం ఏమయిపోయావయ్య, అచ్చు మీ నాన్న పోలికలే, ఎంతయినా మీ వంశమే వంశం, ఇంక మా కష్టాలన్నీ తీరిపోయాయి" అని ముందు డైలాగు కి వెనుక డైలాగు కి సంబంధం లేకుండా 5 నిమిషాలు ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఒక ముసలాయన వచ్చి " బాబూ నువ్వు ఏ నాటికైనా వస్తావని మాకు తెలుసు బాబూ, కాకపోతే నువ్వు ప్రొద్దున 7:30 రైలు కి వస్తావా, మధ్యాహ్నం 12:30 రైలు కి వస్తావా, రాత్రి 7:30 రైలుకి వస్తావా అని అందరం 20 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూనే వున్నాం బాబూ స్టేషన్ వైపు" అని కన్నీళ్ళ పర్యంతం అవుతుండగా, ఒక్క సారి గా వర్షం మొదలవుతుంది. వెంటనే పాట. ఓవరాల్ గా పాట కాన్సెప్ట్ ఏంటంటే -
'మన అన్న వచ్చేసాడు, ఇంక మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇప్పట్నుంచీ వూళ్ళో వర్షాలు రెగ్యులర్ గా పడతాయి. పంటలు పండుతాయి. శత్రువుల గుండెల్లో గూడ్సు రైళ్ళు పరుగెడతాయి ' వగైరా వగైరా .

ఇక ఆ ఓబుల్ రెడ్డి తనవాళ్ళని చంపిన వాడి కొడుకే అని తెలియడం, హీరో వాణ్ణి చంపి హీరోయిన్ ని పెళ్ళి చేసుకోడం చకా చకా జరుగుతాయి.అప్పుడు ఒక 500 మంది ని వేసుకుని సుమోల్లో కత్తులు తిప్పుకుంటూ హీరో మీదకి విలన్ వస్తాడు అన్ని ఫ్యాక్షన్ సినిమాల లో మాదిరిగా. అయితే హీరో వాళ్ళ మీద కి కత్తో కొడవలో తీసుకుని పోవడం కాకుండా,(ఈ సారి వెరైటీ గా) తన బ్యాగ్ లో నుంచి ఒక మెషిన్ గన్ తీసుకుని టుపుక్ టుపుక్ అని కాల్చి అవతల పడేస్తాడు అందరినీ. నెక్స్ట్ సీన్ లో ఫ్యాక్షనిస్ట్ విలన్స్ అంతా సమావేశం అయి అసలు వీడి దగ్గరికి ఆ మెషిన్ గన్ ఎలా వచ్చింది. అసలు ఈ 20 ఏళ్ళు వీడు ఎక్కడున్నాడు ఏం చేసాడు అని సందేహించడం తో (ప్రేక్షకులకి రిలీఫ్ ని ఇచ్చే)
ఇంటర్వల్.

****

ఇంక వూరిలో వాళ్ళ సమస్యలు తీర్చి హీరో 'పెద్దోడు ' అవడం, హీరొ భార్య ప్రెగ్నెంట్ అవడం, ఒక పాట , జరుగుతాయి.ఒక సారి హీరో ఏదొ జోక్ చెబితే పక్కనే వున్న కమెడియన్ గట్టిగా నవ్వుతాడు. హీరో వాణ్ణి దగ్గరిగా పిలిచి బాగా పరిశీలించి అడుగుతాడు - రేయ్, నీ పళ్ళ మీద ఆ గార ఏంట్రా? అని. అప్పుడు కమెడియన్ కళ్ళళ్ళో నీళ్ళు సుడులు తిరుగుతాయి. హీరో ని వున్నఫళంగా బయటికి తీసుకెళతాడు. అక్కడి నీళ్ళు చూపిస్తూ అంటాడు- అయ్యా ప్రపంచం మొత్తం మంచి నీళ్ళూ తాగి దాహం తీర్చుకుంటుంటే సీమ లో మాత్రం ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్నాం అయ్యా ఫ్లోరైడ్ నీళ్ళు అని. అలాగే వూళ్ళోకి తీసుకెళ్ళి ఫ్లోరైడ్ నీళ్ళ వల్ల కీళ్ళు పట్టేసిన ముసలి వాళ్ళని, యూత్ లో నే రకరకాల అనారోగ్యాల పాలయిన యంగ్స్టర్స్ ని చూపిస్తాడు. అప్పుడు హీరో ఇన్నేళ్ళు గా సీమ వెనకబడిపోవడానికి కారణం ఫ్లోరైడ్ నీళ్ళే అని తీర్మానించేసి, నీళ్ళని శుభ్రపరచే ఒక పెద్ద ప్లాంట్ కట్టడం అనే ఒక మహాయఙ్ఞానికి శ్రీకారం చుడతాడు. ఇంక ఆ ప్లాంట్ కి విలన్స్ అడ్డు పడడం, హీరో వాళ్ళని ఎదిరించడం, ఇవన్నీ మమూలే . హీరో కూడాఈ ప్లాంట్ పని మీద కలెక్టర్ ని, హోం మినిస్టర్ ని, ఇంకా ఛీఫ్ మినిస్టర్ ని, గవర్నర్ ని, రాష్ట్రపతి నీ కలవడానికి ఢిల్లీ దాకా వెళతాడు. ఢిల్లీ వెళ్ళి పర్మిషన్ లు అన్నీ తెచ్చి ఇక పని మొదలెట్టే టైం కి సి.బి.ఐ, ఎఫ్.బి.ఐ, ఇంటర్-పోల్,స్కాట్లాండ్ పోలీస్, అందరూ వచ్చి హీరో ని 'యు ఆర్ అండర్ అరెస్ట్' అంటారు. 'బట్ వై' అంటుంది హీరో భార్య. "ఇతను మీ అందరికీ శివయ్య నాయుడి గానే తెలుసు. కానీ పోలీస్ ప్రపంచానికి ఇతనెవరో తెలుసా????? మాఫియా డాన్ 'షేక్'. ప్రపంచవ్యాప్త నెట్-వర్క్ కలిగిన డాన్ షేక్ ఇతనే" .

ఫ్లాష్ బాక్ లో ఫ్లాష్ బాక్:

7 ఏళ్ళ వయసు లో ముంబై వెళ్ళిన శివయ్య ముందు కూలీ గా, తర్వాత చిన్నమోస్తరు రౌడీ గా మారి అనుకోని పరిస్థితుల్లో డాన్ అవుతాడు. అయితే తన భార్య కి ఈ విషయం తెలీదు. మాఫియా డాన్ గా వుండి ముంబై స్లం లో వాళ్ళకి ఆయన చేసిన సేవ కార్యక్రమాలు, ఆయన మాఫియా వ్యవహారాలు, ముంబై లో తనకి ఆశ్రయం ఇచ్చిన ముస్లిం లీడర్ 'షేక్' అనే పేరు పెట్టడం వగైరా వగైరా మీరు ఈ సెకండ్ ఫ్లాష్ బాక్ లో చూస్తారు.

ఇక హీరో ని అరెస్ట్ చేసి తీసుకెళుతున్న పోలీసులకి చీఫ్ మినిస్టర్, ప్రైం మినిస్టర్, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఫోన్ చేసి శివయ్య ని విడిచి పెట్టమని, శివయ్య ఆల్రెడీ ఈ విషయాలన్నీ తమతో చర్చించాడనీ, ఇప్పుడతనికి ఎలాంటి మాఫియా కనెక్షన్లు లేవనీ, పైగా ఇప్పుడతను చేస్తున్న మహా యఙ్ఞం వల్ల 4 జిల్లాలు బాగుపడతాయనీ చెప్పడం తో సి.బి.ఐ, ఎఫ్.బి.ఐ, ఇంటర్-పోల్ ఓ.కె. అంటారు. అయితే స్కాట్లాండ్ పోలీసులు ముందు కన్విన్స్ అవ్వరు. అప్పుడు ప్రైం మినిస్టర్ - 'ధర్మో రక్షితే రక్షితః' అన్న సామెతని ,దాని మీనింగ్ ని డిటెయిల్డ్ గా వివరించాక స్కాట్లాండ్ పోలీసులు కూడా కన్విన్స్ అయి వదిలేస్తారు. (ఆ ..మరిచి పోయా - అప్పుడు అక్కడున్న పోలీసుల్లో ఒకడే - తర్వాత ఐ.పి.ఎస్. అయిన పట్నాయక్).

అయితే హీరో వెనక్కి వెళ్ళేసరికే విలన్స్ ప్రెగ్నెంట్ గా వున్న హీరోయిన్ కడుపు లో క్యిబా క్యిబా అని తన్ని చంపేస్తారు. భార్య చనిపోయిందని హీరో, హీరో కి వంశాంకురం లేకుండా పోయిందని ప్రక్క వాళ్ళూ బాధ పడుతూ అంత్యక్రియలకి ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పుడే ఒక సెన్సేషనల్ సీన్ జరుగుతుంది.ఉన్నట్టుండి ఒక ముసలవిడ గట్టిగా అరుస్తుంది - 'పొట్ట కదులుతోంది రా' అని. ముసలోళ్ళంతా వచ్చి, చనిపోయిన హీరోయిన్ కడుపు ని కోసి, అందులోనుంచి బ్రతికి వున్న హీరో వంశాంకురాన్ని బయటికి తీస్తారు. బ్యాక్-డ్రాప్ లో "పులి బిడ్డ, సిం హం బిడ్డ, చావు ని ఎదిరించి పుట్టినోడు " ఆ టైప్ పాట.ఇంక హీరో - విలన్స్ లో దొరికినవాళ్ళందరినీ చంపేసి, భార్య ఙ్ఞాపకాలతో అకడ వుండలేక ఒరిస్సా కి (ఈ మధ్య ఒరిస్సా లో తెలుగు సినిమా ల కి మార్కెట్ బాగుంది) వెళ్ళి అక్కడ జిం పెట్టుకుంటాడు.


ఇంక క్లైమాక్స్ ఏముందీ, బ్యాలన్స్ మిగిలిన ఒక ఫ్యాక్షనిస్ట్ విలన్ వచ్చి హీరో కొడుకు ని సీమ కి ఎత్తుకెళితే హీరో మళ్ళీ సీమ కి వెళ్ళి మళ్ళీ ఫైట్ చేసి విలన్ ని చంపి, ఇంక ఫ్యాక్షన్ వద్దు. వయొలెన్స్ వద్దు. అహింసా పరమో ధర్మః, ధర్మో రక్షితే రక్షితః అని మెసేజ్ ఇచ్చి, సెకండ్ హీరోయిన్ ని చేసుకోడం తో కథ ముగుస్తుంది.
********************
ఉపసంహారం
మా డిస్కషన్స్ ఇలా జోరుగా సాగుతుండగా దఢేల్ మని తలుపు తెరుచుకుని వచ్చాడు మా క్లాస్మేట్ - 'ఏంటి బాసూ సీరియస్ డిస్కషన్స్?? ' అంటూ.'ఏం లేదు రా. ఫ్యాక్షన్ సినిమా కథ ఒకటి వండుతున్నాం - షేక్ సెబాస్టియన్ నాయుడు అని టైటిల్.'
టైటిల్ తప్ప ఒక్క ముఖ్ఖ ఎక్స్ ట్రా చెప్పకుండానే మా వాడికి స్టొరీ మొత్తం అర్థం అయిపోయింది-
'సీమ సబ్జెక్ట్ లో మత సామరస్యం మెసేజ్. గుడ్. సో రెండు ఫ్లాష్ బాక్ లన్న మాట.కథ కి మరింత పరిపూర్ణత్వం రావడానికి ఒక చిన్న సజెషన్. '

'చెప్పు ' అన్నాం.
'ఇంకో రెండు చిన్న ఫ్లాష్ బాక్ లు చెబుతా. చెరొక 4 నిమిషాలు వుంటాయి.సినిమా లో మీ బుద్ది పుట్టిన చోట వాటిని యాడ్ చేయొచ్చు. ' అని ఆ రెండు ఫ్లాష్ బాక్ లు చెప్పి వాటికి తగ్గట్టు టైటిల్ కూడా లైట్ గా మార్చి వెళ్ళిపోయాడు. వాడు చెప్పిన ఫ్లాష్ బాక్ లు ఏంటి అనేది మీ ఊహ కే (విఙ్ఞత కే ) వదిలేస్తున్నా. వాడు ఫైనల్ గా చెప్పిన టైటిల్ ఇది.
'షేక్ సెబాస్టియన్ నాయుడు సింగ్ దలైలామా'

పండగ చేసుకోండి.(క్రిస్మస్, జనవరి 1st తర్వాత సంక్రాంతి)

Wednesday, November 21, 2007

ఐ నో హిందీ బెటర్ దెన్ హిం.

నా ఫ్రెండ్స్ లో చాలా మంది తమిళియన్స్ వున్నారు. వాళ్ళందరికీ కామన్ గా తమిళ బాష లో నచ్చని ఒకే ఒక్క డైలాగు - 'హిందీ తెరియుమా?' . వీళ్ళందరూ ఈ పుణె శహర్ లో ఇన్నేసి నెలలు/సంవత్సరాల నుండి ఎలా నెట్టుకొచ్చేస్తున్నారని నాకు తెగ డౌట్ వుండేది. ..!!

అప్పట్లో చెన్నై లో ఒకబ్బాయి తగిలాడు. పుణె లో జాబ్ వచ్చింది- నాతో పాటు -అతనూ సేం డే జాయినింగ్, సేం ఫ్లైట్. సరే, ఎయిర్-పోర్ట్ లో కలుద్దాం అని చెప్పా. ఉదయం 7కి ఫ్లైట్ అయితే 5:30 కి నేను మా ఫ్రెండ్ ఒకబ్బాయి (మాత్రమే) ఎయిర్-పొర్ట్ కి వెళ్ళాం. అక్కడికెళ్ళగానే R.B చౌదరి సినిమా లొ క్లైమాక్స్ షాట్ లాగా ఫ్రేం నిండా జనాలు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళూ వీళ్ళూ అబ్బో. అందరూ సేం క్వొశ్చన్ నన్ను - హిందీ తెరియుమా అని. నాకేమో హిందీ తెరియుం. కానీ ఆ విషయం వాళ్ళకి చెప్పడానికి తమిళే తెరియాదు. .! సరే, వాడేమో పుణె వచ్చాక - 'భయ్యా, సైడ్ పే రుకో' అన్న ఒకే ఒక్క సెంటెన్స్ నేర్చేసుకుని - దాంతోనే, వున్నన్ని రోజులూ పుణె ఆటో వాళ్ళని 'గడగడలాడించి' తర్వాత US వెళ్ళిపోయాడు. .!

మా రూం లో ఇంకొక అబ్బాయి వుండేవాడు. తెలుగే కానీ- కుర్రాడి బాల్యము, విద్యాభ్యాసము, బారిష్టర్ చదువులూ మొత్తం చెన్నై లో జరగడం వల్ల హిందీ ఒక్కముక్క కూడా రాకుండా పోయింది. జాబ్ సెర్చింగ్ గురించి పుణె వచ్చాడు. మేమంతా ఆఫీస్ కెళ్తే రూం లో ఒక్కడే వుండేవాడు. వాడికి హిందీ లో 'క్యా' అనే ఒకే ఒక్క పదం (సారీ.. అక్షరం) తప్ప ఏమీ రాదు. అసలు మేమెవరూ లేనప్పుడు పనామె తో హిందీ ఎలా మేనేజ్ చేస్తాడనేది మా పాలిటి కో సస్పెన్స్ థ్రిల్లర్. కూపీ లాగడానికి ఎన్ని సార్లు ఎంత స్ట్రాంగ్ గా ట్రై చేసినా అంత కంటే 'స్ట్రాంగ్' గా ఎదుర్కొనేవాడే తప్పించి విషయం చెప్పేవాడు కాదు. అట్టాంటిది ఒకానొక 'వీక్'ఎండ్, రూం లో కరెంట్ పోయి, 'పిల్ల ' గాలి కోసం మిద్దె మీదకెళ్ళినప్పుడు విషయం చెప్పాడు- మొదట్లో ఆమె ఏమడిగినా క్యా, క్యా అని తప్ప మరో మాట మాటాడకపోవడం తో ఆమే సూక్ష్మం గ్రహించేసి ఒక పుష్పకవిమానం టైప్ సైగబాష కి ఫిక్స్ అయిపోయిందంట. ఇప్పుడూ..రూం లో నీళ్ళు అయిపోయాయనుకోండి..ఆమె డైరెక్ట్ గా వెళ్ళి ఖాళీ బకెట్ ఒక దాన్ని పైకి ఎత్తి ధభేల్ మని కింద పడేసి (నీళ్ళు లేవన్నట్టుగా) చేతులు వూపుతుందంట (మా రూం లో నీళ్ళకు - బోర్ . మేమే మోటార్ వేయాలి). అప్పుడూ..మా వాడేమో గబగబా ఫ్యాన్ స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ వేసి - తిరగని ఫ్యాన్ వైపు చూపిస్తూ(కరెంట్ లేదన్నట్టు) చేతులు వూపుతాడంట. అదీ సంగతి. అలా మా వాడు కొన్నాళ్ళు 'డంబ్ చారడ్శ్ ' లో ప్రావీణ్యం సంపాదించాక చివరికి బెంగళూర్ వెళ్ళిపోయాడు.

ఇక ఆఫీస్ లో ఇద్దరు ఫ్రెండ్స్ వున్నారు. ఇద్దరూ తమిళే. వాళ్ళిద్దరూ ఆపుడప్పుడూ హిందీ లో మాట్లాడుకుంటారు - లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుందామని. అబ్బో. వాళ్ళు 'నీఛే' ప్లేస్ లో 'పీఛే' , 'పీఛే' ప్లేస్ లో 'నీఛే' పెట్టి మాట్లాడే హిందీని ఏ ఇ.వి.వి సత్యనారాయణ లాంటోడో గనక వింటే ..చచ్చారే.. సెన్సార్ వాళ్ళు..!! వాళ్ళిద్దరికీ మళ్ళీ కాంపిటీషన్. నా హిందీ బాగుందంటే నాది బాగుందని.
ఒక సారి వాళ్ళలో ఒకతనన్నాడు మాతో , రెండో అతన్ని ఉద్దేశ్యించి - 'హే, ఐ నో హిందీ బెటర్ దెన్ హిం యార్ ' అని.
"ఒరే నువ్విదే ముక్క హిందీ లొ చెప్పరా - మేమంతా ఒప్పేసుకుంటాం, యు నో హిందీ బెటర్ దెన్ హిం అని" అని చెప్పా. ఖంగుతిన్నాడు.!!

Sunday, November 4, 2007

టాలీవుడ్ గీతాంజలి..

( టాగూర్ గీతాంజలి కి పేరడి - తెలుగు చలనచిత్ర జగత్తు నేపథ్యం లో ..సారీ.. టాలీవుడ్ బ్యాక్-డ్రాప్ లో ..)

ఎచ్చట ప్రెగ్నెన్సీ లో ఉన్న హీరో చెల్లి డొక్క లో విలన్ లు 'క్యిబా క్యిబా' అని తన్నరో..
ఎచ్చట హీరో డైరీ ని హీరోయిన్ క్లైమాక్సు కు ముందు మాత్రమే చదవదో..
ఎచ్చట పాకిస్తానీ తీవ్రవాదులు పరవస్తు చిన్నయసూరి కంటే స్పష్టమైన తెలుగు మాట్లాడరో..
ఎచ్చట డిగ్రీ కాలేజీ ఇన్స్పెక్షన్ కి డి.ఈ.వో. లు రారో..
ఎచ్చట పేషెంట్స్ కి 'కేన్సర్- లుకేమియా ' కాక వేరే జబ్బులు కూడా వస్తుంటాయో..
ఎచ్చట మరణగోగుల సంగీతం ఉండదో..
ఎచ్చట 'టెక్నికాలిటీ ' అంటే స్టడీకామేసుకుని సందుల్లో పరిగెత్తటం మాత్రమే కాదో..
ఎచ్చట 'నిర్-మాత ' అంటే తను తీసిన సినిమా ని 'అమ్మ-లేని ' వాడు అని అర్థం కాదో..
అట్టి స్వేచ్ఛామయ స్వర్గధామం లోకి ఈ టాలీవుడ్ ని నడిపించు తండ్రీ..!!

Tagore's original poem..

WHERE the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way Into the dreary desert sand of dead habit Where the mind is led forward by thee Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.

Monday, October 22, 2007

నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!

ఐ.టి. లో పనిచేసే కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ ని చూసాక సరదా గా వ్రాసింది...

నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!

ఏంట్రా ఈ జీవితం అంటాడు,
వేస్ట్ లైఫ్ రా మనది అంటాడు,
ఐ.టి లో నో, ఐ.ఐ.టి లో నో ఉంటాడు !!
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!

'మనం వేస్ట్ రా బాబూ..' అంటాడు,
మనకి లైఫ్ ప్లానింగ్ అస్సలు చేతకాదంటాడు,
ఊరిలో వంద ఎకరాలు కొంటాడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!

'అమ్మాయిలొద్దురా బాబూ - టార్చర్ ఫెలోస్' అంటాడు
అయినా మనకెందుకు రా అమ్మాయిలు అంటాడు
రాత్రి మినిమమ్ రెండు గంటలు సెల్ లో 'సొల్లు'తాడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!

ఫ్రెండ్ ఫొన్ చేస్తే, ఐ.టి. లోకి రావద్దంటాడు
వర్క్ లోడ్ ఎక్కువంటాడు - జాబ్ సెక్యూరిటి తక్కువంటాడు
వచ్చావంటే నీ లైఫ్ 'ఖండం అయిపొద్ది' అంటాడు
వీడేమో ఆన్ సైట్, H1 తప్ప వేరే ఏమీ ఆలోచించడు!!
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!

'ఎదవ జీవితం ' - పెళ్ళి కూడా కావట్లేదంటాడు
అమ్మాయి దొరకట్లేదంటాడు - అయినా మనకెవడిస్తాడంటాడు
ఇంట్లో వాళ్ళు 'మ్యాచ్' చూపిస్తే ఫ్లాట్, కార్ కొన్నాకే పెళ్ళి అంటాడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!

నేను 'కూల్-డ్యూడ్' ని అంటాడు
నేను జాలి క్యాండిడేట్ అంటాడు
పని ఒక్కటే లైఫ్ కాదంటాడు
ఉదయం 8 కి ఆఫీస్ కి పోతే రాత్రి 11 అయినా బయటికి కదలడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని! !!

Monday, October 15, 2007

త్రివిక్రం డైలాగులు

ఈ మధ్య ఎవడైనా మంచి పంచ్ ఒకటి విసిరితే చాలు - ఏంటి బాసూ త్రివిక్రం స్కూల్ లో జాయిన్ అయ్యావా అంటున్నారు జనాలు. ఇప్పుడంటే త్రివిక్రం ట్రెండ్ నడుస్తోంది కానీ నేను ఇంజినీరింగ్ చదివేటప్పటికి ఇంకా త్రివిక్రం సినిమాల్లోకి రాకపోవడం వల్ల అప్పట్లో మా ఫ్రెండ్స్ అంతా 'ఇ.వి.వి. స్కూల్ ' లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేవాళ్ళు. అప్పటి సంగతులు.

1. ఒక సారి మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళ తెలిసినతనికి అన్న వరస ఒకాయనకి క్యాంపస్ లో పని వుంటే మా రూం లో దిగాడు. మా రూం లో మిగతా వాళ్ళూ ఒకే బ్రాంచ్ అవడం తో సబ్జెక్ట్ కి సంబంధించిన బుక్స్ చాలా వుండేవి- నీట్ గా వుండేవి కూడా, ఎవరూ పెద్దగా టచ్ చేయకపోవడం వల్ల. వచ్చినతను రాగానే రూం ని పుస్తకాలనీ చూసాడు. బాగా చదువుకునే టైప్ క్యాండిడేట్ అనుకుంటా- అన్నేసి పుస్తకాలు చూసేసరికి తెగ ముచ్చట పడ్డాడు.

అతనన్నాడు - 'మీ రూం లో బుక్స్ కలెక్షన్ బాగా వున్నట్టుందే ' .
ఠకీమని రిప్లై వచ్చింది ఒక మూల నుంచి- ' కలెక్షన్ బాగానే వుంటది, కానీ వాటితో మాకు కనెక్షనే - అస్సలుండదు '.

2. ఇంకొకసారి ఇంజినీరింగ్ అప్పుడే- మా ఫ్రెండ్ వచ్చి అన్నాడు -
'బాసూ నేను రూం మారుదామనుకుంటున్నాను. ఆ సైకో గాడి తో కలిసి నేను ఉండలేను.'
నేనేమో అప్పటికే 'ఇంద్ర-బార్న్ ఫర్ పీపుల్ ' లాగా చాలా మంది ని రూం లో అడ్జస్ట్ చేసి వుండడం తో మా రూం కిటకిటలాడుతూండేది. మరి మా రూం కి వస్తానంటాడేమో అని అన్నానో లేక క్యాజువల్ గా అన్నానో గుర్తు లేదు కానీ, అన్నాను-
'వాడి గురించి తెలిసిందే కదా, నువ్వే కొంచెం సర్దుకుపోవాలి '.
వెంటనే అన్నాడు మా వాడు- " వాడి గురించి 'తెలిసింది ' అందుకే 'సర్దుకుని ' పోతున్నాను ".

3. మా మెస్ లో ఒక వర్కర్ వుండేవాడు. బాగా సోమరి. రోజూ ఒకే గళ్ళ చొక్కా వేసుకుని వచ్చేవాడు. వడ్డించేటపుడు మా ఫ్రెండ్ అడిగాడు-
'ఇవాళేంటి కర్రీ' అని.
'ఇవాళ (కూడా) ముల్లంగి సార్ ' అన్నాడు.
మా వాడు అన్నాడు కొంచెం చిరాకుగా - ' కొంచెం మార్చండయ్యా- రోజూ ఈ ముల్లంగి నీ, నీ గళ్ళంగి నీ చూడలేక చచ్చిపోతున్నాం ' .

4. ఇంకొకటి. ఓ సారి మా రూం-మేట్ ఒకబ్బాయి అన్నాడు.
"జుట్టు బాగా తెల్లబడింది. ఇవాళ హెయిర్ డై అయినా వేసుకోవాలి".
ప్రక్కన అబ్బాయి అన్నాడు- " ఇవాళ వద్దులే ఇంకెప్పుడైనా వేసుకో ".
"ఏం? ఎందుకలాగా?" .
" అంటే..'డై అనదర్ డే' అన్నారు కదా అందుకని.." .

Monday, October 8, 2007

సినిమా వాళ్ళ మాటలకి అర్థాలే వేరులే!!

సినిమా వాళ్ళ తెలుగు, మనం మామూలు గా మాట్లాడుకునే తెలుగు రెండూ ఒకటేనన్న పెద్ద అపోహ లో వుంటారు చాలామంది. చాలా పొరపాటది. దానికీ దీనికీ రాధిక కి సాధిక కి ఉన్నంత తేడా ఉంది. సినిమా వాళ్ళు మాట్లాడే మాటల వెనుక వుండే అసలు అర్థం తెలియాలంటే కొంచెం జాగ్రత్త గా పరిశీలించాలి.

ఉదాహరణకి సినిమా వాళ్ళు ప్రెస్ మీట్ లో, ఇంటర్వ్యూ లో మాట్లాడే కొన్ని సినిమా తెలుగు మాటలని సాధారణ తెలుగు లోకి డబ్బింగ్ చేస్తే సారీ ట్రాన్స్ లేట్ చేస్తే ఇలా ఉంటాయి. (సినిమా వాళ్ళ తెలుగు ని, దాని ప్రక్కనే తెలుగు లో ఆ వాక్యం అసలు మీనింగ్ ని గమనించగలరు)

ప్రెస్ మీట్ - సినిమా మొదలెట్టే మందు:

కథే హీరో - హీరో గా ముక్కూ మొఖం(లేని)తెలీని సన్నాసిగాణ్ణి పెట్టాం.
ఈ సబ్జెక్ట్ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు - ఈ సారి ఎవరికి తెలీని ఇరాన్ సినిమా ని కాపీ కొట్టాం.

పక్కా స్క్రిప్ట్ తో మొదలెడుతున్నాం - స్టోరీ లైన్ రెడీ అయింది

ప్రెస్ మీట్ - సినిమా రిలీజ్ కి ముందు:

మా డైరెక్టర్ మేమనుకున్న దాని కంటే బాగా తీసాడు - వీడు ఈ మాత్రం తీస్తాడని అనుకోలేదు ముందు.
స్క్రీన్ ప్లే చాల ఫాస్ట్ గా వుంటుంది - పెద్ద స్టోరీ ఏమీ ఉండదు.
రీమేకే అయినా నేటివిటి మార్పులు చాలా చేసాం - ఫస్ట్ సాంగ్ మూడో స్టెప్ లో హీరో లుంగీ కి బదులు ప్యాంట్ వేసుకుంటాడు.

రిలీజ్ అయ్యాక -

మొదట్లో డివైడెడ్ టాక్ వినిపించింది - ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన వాళ్ళు బండబూతులు తిట్టారు.
స్లో గా పికప్ అవుతోంది- కౌంటర్ లో ఈగలు తోలుకుంటున్నారు.
సినిమా చూసిన వాళ్ళంతా టెక్నికల్ గా చాలా బాగుందంటున్నారు - సినిమా ఓవరాల్ గా ఛండాలంగా వుందంటున్నారు.
సినిమా విశ్లేషకుల అంచనాలను తలకిందలు చేసి, ట్రేడ్ పండితులని ఆశ్చర్యపరిచింది- చెత్త సినిమా నే, కానీ (అక్కడక్కడా) ఆడుతోంది, ఎందుకో తెలీదు.

Thursday, October 4, 2007

ఈనాడు లో మా తమ్ముడి ఆర్టికల్..

అప్పుడెప్పుడో మా తమ్ముడు ఈనాడు లో వ్రాసిన ఆర్టికల్ ....


Wednesday, October 3, 2007

రాహుల్ గాడు

నేను పుణె లో ఉన్నపుడు మా ఆఫీస్ లో ఒక 50% నార్త్ వాళ్ళు మిగిలిన వాళ్ళ లో తెలుగు, తమిళ్ గట్రా ఉండేవాళ్ళం. అమ్మాయిలూ బాగానే ఉండేవాళ్ళు. ఓ రోజు నేను, మా ఫ్రెండ్ ఒకబ్బాయి సాయంత్రం స్నాక్స్ కి క్యాంటీన్ కి వెళ్ళాం. అతని టీం కూడా మిలటరీ బ్యాచే మా లాగా! మా పాటికి మేము కూర్చుని చిరంజీవి, బాలయ్య బాబు, వై.యస్. తదితర తెలుగు తేజాల గురించి మాట్లాడుకుంటుంటే మా కాన్సంట్రేషన్ ని ('కాన్ఫిడెన్స్ ని' అని చదవగలరు) దెబ్బ తీస్తూ ఒక నార్త్ వాడు ఒక్కడే ఐదుగురు అమ్మాయిలని వెంటవేసుకుని క్యాంటీన్ లోకి వచ్చాడు . వాళ్ళూ ఏవో స్నాక్స్ తీసుకుని కూర్చున్నారు. మేము మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు వాళ్ళ వైపు చూస్తూ మీ ఆఫీస్ లో లాగే ఛండాలంగా ఉండే మా ఆఫీస్ స్నాక్స్ తింటున్నాం. ఉన్నట్టుండి వాడు గట్టిగా పాడడం మొదలెట్టాడు. ఏదో హిందీ సాంగ్. అదీ ఫుల్ మెలోడీ. తగ్గేదే లేదు!! పాడుతూ పాడుతూ కళ్ళు కూడా మూసుకుని ఇంకా తన్మయత్వం తో పాడుతూన్నాడు గట్టిగా!

ఎవడు బాసూ ఈ ఎదవ అని నేను అనబోయేలోపు మా ఫ్రెండ్ - 'రాహుల్ ఇరగదీస్తున్నడు గా' అన్నాడు వాడి వైపు చూపిస్తున్నట్టుగా కళ్ళెగరేస్తూ!! ఒక్క క్షణం పాజ్ ఇచ్చి 'వాడు తెలుసా నీకు' అని అడిగా. 'అబ్బే ఛ! ' లేదు అన్నాడు. 'మరి రాహుల్ అన్నావ్' అన్నాను.

'ఏమో బాసూ నాకు నార్త్ వాడు ఎవడైనా ఇలా ఉండి (బక్కగా, పొడుగ్గా, మీసం లేకుండా ప్లస్ ఫుల్ ఆత్మవిశ్వాసం తో - కనబడ్డాడా??), ఇలాంటి పనులు (ఐదుగురు అమ్మాయిలని వేసుకుని ఒక్కడే క్యాంటీన్ కి రావడమే కాక సీరియస్ గా తన్మయత్వం తో రొమాంటిక్ పాట పాడి వినిపించడం ) చేస్తుంటే వాడి పేరు గ్యారంటీ గా రాహుల్ అయివుంటుందని నా స్ట్రాంగ్ బిలీఫ్' అన్నాడు.

ఆలోచించాను. నాకూ నిజమేననిపించింది !!
(రాహుల్ పేరున్న తెలుగు పాఠకులకి క్షమాపణలతో)

Tuesday, October 2, 2007

ఫిల్మ్ మేకింగ్ - హాలివుడ్ Vs టాలివుడ్

సినిమా తీయడం ఒక పెద్ద ఆర్ట్. మన తెలుగు సినిమాలు చూడగలగడం ఇంకా పెద్ద ఆర్ట్. ఆ 'ఇంకా పెద్ద ఆర్ట్' గురించి మరెపుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి 'పెద్ద ఆర్ట్' గురించి మాట్లాడుకుందాం. సినిమా తీయడానికి ఒక పద్దతి, ఒక విధానం ఉంటాయి. అవి ఇండస్ట్రీ ని బట్టి (హాలివుడ్డా, టాలివుడ్డా, మాలివుడ్డా, కోలివుడ్డా ?? ) మారుతూ ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ తెలీక కొన్ని సార్లు కొంత మంది ఫిల్మ్ మేకర్స్ బోల్తా పడుతూంటారు. అలా ఇక పై ఎవరూ బోల్తా పడకూడదనే ఈ పోస్ట్.

ఫిల్మ్ మేకింగ్ - హాలివుడ్ లో అయితే -



-(ఇదే ఆర్డర్ లో చేయడం అనేది చాలా ముఖ్యం. క్రమం తప్పితే బొల్తా పడ్డట్టే..!)

1. కథ తయారు చేసుకోవాలి.
2. కథ చెప్పే (నేరేట్ చేసే ) విధానం నిర్ధారించుకొవాలి . ఉదాహరణకి - కథ ని ఫ్లాష్ బాక్ లో చెప్పాలా లేక నేరు గా చెప్పాలా, నాన్-లీనియర్ ఫ్యాషన్ లొ చెప్పాలా లేక ఇంకేదైనా కొత్త పద్దతి లో చెప్పాలా అనేది నిర్ధారించుకొవాలి. స్క్రీన్ ప్లే వ్రాసుకోవాలి.
3. సినిమా షూట్ చేయడానికి ఉపయోగించవలసిన టెక్నాలజీ నిర్ధారించుకోవాలి. ఉదాహరణకి ఫలానా సీన్ కి అండర్-వాటర్ కెమెరా వాడాలా లేక ఆ అవసరం లేదా? 35 mm కెమెరా వాడాలా? లేక ఇంకేదైనా కొత్త టెక్నాలజిని ఉపయోగించుకోవలసిన అవసరం ఉందా ఈ కథ ని చెప్పడానికి? ఇలాంటివన్నమాట!
4. 'నటీనటుల ' కాల్షీట్లు తీసుకోవాలి.

ఇదే ఫిల్మ్ మేకింగ్ టాలివుడ్ లో అయితే-


1. ముందు 'హీరో, హీరోయిన్ ల ' కాల్షీట్లు తీసుకోవాలి.
2. సినిమా షూట్ చేయడానికి ఉపయోగించవలసిన టెక్నాలజీ నిర్ధారించుకోవాలి. ఉదాహరణకి ఫలానా సీన్ కి ( అవసరం లేని) అండర్-వాటర్ కెమెరా వాడాలా ? 35mm కెమెరా వాడాలా(పోయిన శుక్ర వారం రిలీజ్ అయి ఘోరం గా ఫ్లాప్ అయినా 'టెక్నికల్ గా(?) 'బాగుందని పేరు తెచ్చుకున్న ప్రక్క సినిమా కి ఇదే వాడారు)? లేక ఇంకేదైనా కొత్త టెక్నాలజిని ఉపయోగించుకుంటే పోతుందా (సినిమా కాదు)? ఇలాంటివన్నమాట!
3. కథ చెప్పే (నేరేట్ చేసే ) విధానం నిర్ధారించుకొవాలి . ఉదాహరణకి - కథ ని ఫ్లాష్ బాక్ లో చెప్పాలా లేక నేరు గా చెప్పాలా? (నేరు గా అంటే ఏమీ లేదు- టైటిల్స్ కి ముందు కొంచెం స్టోరీ అని అర్థం). స్క్రీన్ ప్లే ఏరోజు కి ఆ రోజు వ్రాసుకోవాలి.
4. కథ దొరికితే పర్లేదు, లేదంటే స్టొరీ లైన్ తయారు చేసుకోవాలి. కుదరకపోతే పాటల తో షూటింగ్ స్టార్ట్ చేయాలి.

Monday, October 1, 2007

యూనివర్సిటీ లో సంధ్యాసమస్యలు

(శ్రీ శ్రీ రాసిన సంధ్యాసమస్యలు కి పేరడి )

ఇటు చూస్తే లేడీస్ హాస్టల్ ,
అటు చూస్తే ఎస్పీడబ్ల్యూ!
ఎటకేగుటో సమస్య తగిలిం
దొక 'బీట్ టెక్ ' స్టూడెంట్ కి!!

అటు చూస్తే తొలిప్రేమ,
ఇటు చూస్తే చందమామ!
ఎంచుకొనే సమస్య కలిగిం
దొక నవ యువకుడికి !!

ఆ సాయంత్రం ....
అమ్మాయి పలకరింపు,
మనసంతా పులకరింపు!
స్నో ఫీల్డ్ కి పిలుచుకుపోవడమో,
బ్రెడ్ వరల్డ్ కి తీసుకెళ్ళడమో --
సమస్యగా ఘనీభవించిందొక గ్రీకు వీరుడికి !!

(ఇది నేను తిరుపతి SVU లో ఇంజినీరింగ్ చదివేటపుడు రాసింది ఎస్పీడబ్ల్యూ - తిరుపతి వుమెన్స్ కాలేజి , స్నోఫీల్డ్, బ్రెడ్ వరల్డ్ తిరుపతి లో ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు)
శ్రీ శ్రీ గారి అసలు కవిత ఇదీ -

సంధ్యాసమస్యలు
-------------------
రాక్సీలో నార్మా షేరర్,
బ్రాడ్వేలో కాంచనమాల!
ఎట కేగుటొ సమస్య తగిలిం
దొక విద్యార్థికి!

ఉడిపీ శ్రీకృష్ణవిలాస్‌లో --
అటు చూస్తే బాదం హల్వా,
ఇటుచూస్తూ సేమ్యా ఇడ్లీ!
ఎంచుకొనే సమస్య కలిగిం
దొక ఉద్యోగికి!

ఆ సాయంత్రం...
ఇటు చూస్తే అప్పులవాళ్ళూ,
అటు చూస్తే బిడ్డల ఆకలి!
ఉరిపోసుకు చనిపోవడమో,
సముద్రమున పడిపోవడమో --
సమస్యగా ఘనీభవించిందొక సంసారికి!

తెలుగు లో మీ ముందుకు

త్వరలో...