Monday, June 22, 2009

'ఎర్రని గాజులు' అను ఒక బ్లాక్ బస్టర్.

తెలుగు సినీ పరిశ్రమ మొత్తం RS బ్రదర్స్ అవాక్కయ్యింది. సినీ విమర్శకులకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. కొన్ని పాత ఙ్ఞాపకాలు గుర్తుకొచ్చి కొంతమంది సినీ ప్రేమికులకి వెన్నులో చలి, నెత్తి మీద ఎండ, కాలి కింద దురద ఒకే సారి పుట్టిన ఫీలింగ్ కలిగింది. వీటన్నిటికీ కారణం ఒక్కటే - పాపిరాజు మళ్ళీ వచ్చాడు. ఐదేళ్ళ క్రితం ఒక అనూహ్య సినిమా తీసి, కొన్ని అరుదైన రికార్డులని అడ్డదిడ్డంగా బద్దలుకొట్టి, కొన్ని అనివార్య పరిస్థితుల్లో అఙ్ఞాతంలోకి వెళ్ళిపోయి, ఇన్నేళ్ళుగా అదృశ్యమైన పాపిరాజు సడెన్ గా ఇన్నాళ్ళకి తెరమీదకి వచ్చాడు. వస్తూ వస్తూనే ఒక సంచలనాత్మకమైన కాంబినేషన్ కి తెరలేపాడు. తెలుగు సినీ పరిశ్రమ ని ఒక అత్యంత కీలకమైన మలుపు తిప్పబోయే రైటర్ గా అందరూ ఊహిస్తున్న యువ రచయిత హితేష్; చెప్పిన ప్రేమ కథనే మళ్ళీ చెప్పి, తర్వాతి సినిమా లో మళ్ళీ చెప్పి, ఒక్క లైను కూడా కథ మార్చకుండా మళ్ళీ మళ్ళీ చెప్పి, చెప్పిన ప్రతి సారీ బాక్సాఫీసుని చితక్కొట్టే ప్రేమకథల డైరెక్టర్ తేజస్వి ల కాంబినేషన్ లొ తన నాలుగో సినిమా అనౌన్స్ చేసాడు పాపిరాజు. విడి విడి గా హ్యాట్రిక్ హిట్లు కొట్టిన వీళ్ళిద్దరినీ తొలిసారి కలుపుతూ పాపిరాజు ప్రారంభించిన సినిమా అతనికి మంచి కం-బ్యాక్ ఫిలిం అవుతుందనే అందరూ అంచనా వేశారు. అయితే నాకు 'ఊహ' తెలిసినప్పటినుంచీ (అంటే ఇ.వి.వి. సత్యనారాయణ 'ఆమె ' సినిమా రిలీజ్ అయినప్పట్నుంచి) టాలీవుడ్ లో ఇలాంటి అంచనాలు 'నిజమ' వడం నేనెప్పుడూ చూడలేదు. ఇంతకీ ఈ సినిమా ఏమైందో తెలుసుకునే ముందు ఈ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ల ప్రొఫైల్స్ కొంచెం మనం తెలుసుకోవాలి.

డైరెక్టర్ ప్రొఫైల్:
ఒక పల్లెటూరుంటుంది. అందులో ఒక రావి చెట్టు ఉంటుంది. దాని కింద మాత్రమే కూర్చుని తీర్పు చెప్పే ఒక రాయుడు గారు ఉంటారు. ఆయనకో కూతురుంటుంది. బీద రాములవ్వ కొడుకు ని ప్రేమిస్తుంది. హిట్టు. మళ్ళీ ఒక పల్లెటూరుంటుంది. ఒక మఱ్ఱి చెట్టుంటుంది. పొద్దస్తమానం దాని కింద కూర్చుని పేకాడే భూస్వామి ఉంటాడు. ఆయనకి కూతురుంటుంది. పాలమ్మే సీతక్క కి జులాయి తమ్ముడుంటాడు. మళ్ళీ హిట్టు. ఈ సారి వేప చెట్టుంటుంది. వేదాలు తెలిసిన సిద్దాంతి ఉంటాడు. ఆయనకో చిట్టి చెల్లెలు ఉంటుంది. వీళ్ళ పని మనిషి కొడుక్కి చిన్నప్పట్నుంచే ఫ్లూటు వాయించడం, పాటలు పాడటం, పొలాల్లో జామకాయలు దొంగతనం చేయటం వచ్చు. సూపర్ డూపర్ హిట్టు. ఇట్లా హిట్టు మీద హిట్టు తో హ్యాట్రిక్ కొట్టి మాంచి ఫాం లో ఉన్న స్టార్ డైరెక్టర్ తేజస్వి కి పాపిరాజుది నాలుగో సినిమా.

రైటర్ ప్రొఫైల్:
ఒక క్లాస్ రూం. మేడం పాఠం చెబుతోంది. స్టూడెంట్స్ శ్రద్ద గా వింటున్నారు. "ప్రేమ అనేది ఊహ కి సంబంధించింది. ఊహ అనేది ప్రేమ కి సంబంధించింది. ప్రేమ, ఊహ - ఈ రెండూ మనసు కి సంబంధించినవి" - ఇలాంటి ఎన్నో ఆణి ముత్యాల లాంటి డైలాగులు, సన్నివేశాలు హితేష్ గారి కలం నుంచి అలా అలా అలవోక గా జారిపడ్డాయి. అది ఏడో తరగతి అయినా, ఎమ్మెస్సీ అయినా ఎం.బి.బి.ఎస్. అయినా హితేష్ గారి కలం పదును లో ఏ మార్పూ వుండదు,చెప్పే పాఠం లో అస్సలు మార్పుండదు. '12వ తరగతి ' , '11వ తరగతి ', '10 వ తరగతి ' అని గత మూడు వేసవుల్లో మూడు బ్లాక్ బ్లస్టర్స్ ఇచ్చిన హితేష్ డైలాగుల్లో చాలా మటుకు కుర్రాళ్ళని ఉర్రూతలూగించాయి. ఆ మాటకొస్తే '12వ తరగతి' సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ లు కోర్టు లో జిల్లా జడ్జి తో వాదన లో గెలిచే సీన్, '11 వ తరగతి' క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ లు హైకోర్ట్ జడ్జికే 'ప్రేమ' గొప్పదనాన్ని వివరించే సీన్, '10వ తరగతి' క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ లు తమ ప్రేమ లోని ఒడిదుడుకులని ఎదుర్కొనే క్రమం లో సి.బి.ఐ. ని ఎలా బురిడీ కొట్టించిందీ చెప్పి 'సుప్రీం' జడ్జినే ఖంగు తినిపించే సీన్స్, కుర్రకారు లో ఒక దాన్ని మించి ఒకటి సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇన్ని కళాఖండాలలాంటి కథలు, స్వాతిముత్యాల్లాంటి సీన్లు, రాసిన హితేష్ కి ఇది నాలుగో సినిమా.

ప్రొడ్యూసర్ ప్రొఫైల్:
గతం లో రెండు డబ్బింగ్ సినిమాలు, ఒక స్ట్రెయిట్ సినిమా తీసి చేతులు, పొలాలు, ఆస్తులు, ఇంటి దస్తావేజులు కాల్చుకుని ఐదేళ్ళ పాటు పత్తా లేకుండా పోయిన పాపిరాజుకి కూడా ఇప్పుడు తీయబోయేది నాలుగో సినిమాయే. నిజానికి పాపిరాజు మొదట తీసిన రెండు డబ్బింగ్ సినిమాల్లోనూ నష్టాలేమీ రాలేదు. అలాగని లాభాలూ కాదు. నో లాస్ నో గెయిన్ ప్లస్ దారి ఖర్చులు, భోజనం ఖర్చులకి డబ్బులొచ్చాయి. ఇలా గొర్రెబెత్తెడు లాభాలు కాదు ఏనుగు కుంభాన్నే కొట్టాలి అనుకుని ప్రముఖ మళయాళీ ఐటెం బాంబ్ రష్మి ని మెయిన్ లీడ్ లో పెట్టి, హిట్ స్ట్రీక్ లో వున్న ఒక మళయాళీ డైరెక్టర్ ని తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా స్టార్ట్ చేసాడు పాపిరాజు. ఆ సినిమా పేరు - 'పాప-పాప-పాప' .

సినిమా అనౌన్స్ చేయడం, ప్రారంభించడం, షూటింగ్ అయిపోవడం - అన్నీ చక చకా జరిగి పోయాయి. గప్ చిప్ గా షూటింగ్ జరుపుకున్నా, పెద్ద గా పబ్లిసిటీ చేయకపోయినా కూడా రిలీజ్ టైం కల్లా ఊహించని రీతి లో క్రేజ్ వచ్చింది సినిమా కి. అయితే ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నిర్మాతలు పావలా పబ్లిసిటీ చేయకపోయినా కూడా సినిమా కి అంత క్రేజ్, అంత హైప్ క్రియేట్ అయిందంటే, నిజనికి ఆల్ ద క్రెడిట్ గోస్ టు మన తెలుగు కుర్రాళ్ళే. రష్మి, ఆ మళయాళీ డైరెక్టర్ కాంబినేషన్ సినిమా అనౌన్స్ అవగానే, అసలు ఆ మళయాళీ డైరెక్టర్ ఎవరు, ఆయన బాల్యమేవిటీ, ఆయన విద్యాభ్యాసమేవిటీ, ఆయన మునుపు తీసిన మళయాళీ సినిమాలు ఏవిటీ, వాటిల్లోని ప్రాముఖ్యమైన సన్నివేశాలు, క్లిపింగులు ఏవిటీ అనేది కొంత రీసెర్చి, కొంత గూగుల్ సెర్చి చేసి, రాబోయే సినిమా ఎలా వుండబోయే ఆస్కారముంది అని కొంత అవగాహన తెచ్చుకుని, పదిమందికీ చెప్పడం వల్ల అంత క్రేజ్ ఏర్పడింది ఈ సినిమాకి. అఫ్ కోర్స్, ఈ కాంబినేషన్ చూసి, 'పాప-పాప-పాప ' అనే టైటిల్ చూసి బోలెడు ఇన్-సైడ్ స్టోరీలు కూడా వచ్చాయి. కొందరేమో రష్మి ది ఈ సినిమా లో ట్రిపుల్ రోల్, బహుశా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ మీద సినిమా కావచ్చన్నారు. కొందరేమో, అదేం కాదు, రష్మి ది సింగిల్ రోలే కానీ మూడు డిఫరెంట్ గెటప్స్ ఉంటాయన్నారు. ఇంకొందరు - అసలు ఇది 1960 లో వచ్చిన ఇంగ్లీష్ మూవీ 'Kid, Child and a Baby' బేసిక్ లైన్ తీసుకుని స్టొరీ డెవలప్ చేసారంట అన్నారు. వీటన్నిటి మూలాన క్రేజ్ మరీ పతాకస్థాయి కి చేరింది. రిలీజ్ కి వారం ముందే ఈ సినిమాలోని కొన్ని క్లిపింగులు లీకయి, యూ-ట్యూబ్ లో అప్-లోడ్ అయ్యాయని రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ ని ఆ వీడియోస్ ని కలిపి నిరంతరవార్తాస్రవంతి ఛానెల్ '30 నిమిషాలు' ప్రోగ్రాం ని ప్రైం టైం లో ప్రసారం చేసింది. అయితే విఙ్ఞులైన తెలుగు కుర్ర ప్రేక్షకులు ఈ వీడియోలు కొత్త సినిమా లోవి కావనీ పోయినేడాది మళయాళం లో రిలీజ్ అయి, తెలుగు లోకి డబ్బింగ్ అవని రష్మి సినిమా లోని సన్నివేశాలని సునాయాసంగా పసికట్టేసి, ఇలాంటి జిమ్మిక్కులని పట్టించుకోకుండా ఒరిజినల్ పాప-పాప-పాప కోసం మరింత ఉత్సాహంగా ఎదురు చూసారు. ఏదైతేనేం ఆ రోజు రానే వచ్చింది. వేయి అమవాస్యల తర్వాత ఒకే పున్నమి వచ్చినట్టు, నూటా డెబ్బైనాలుగు మిగతా బస్సులు వెళ్ళిపోయిన తర్వాతే మనమెక్కాల్సిన ఆర్టీసీ బస్సు వచ్చినట్టు.

సినిమా రిలీజ్ అయింది. యూత్ జాతర. థియేటర్ దరిదాపు రోడ్లన్నీ జాం. ఒకటే కోలాహలం. ఎట్టకేలకు మార్నింగ్ షో మొదలయింది. దాంతోపాటే థియేటర్ కి వచ్చిన కుర్రాళ్ళ కంట రక్త కన్నీరు కూడా. యావత్ భారత దేశం లో గత రెండున్నర దశాబ్దాలుగా ఏ భాష లోనూ రానటువంటి నిఖార్సైన 'సమాంతర, న్యూవేవ్, సర్రియలిస్టిక్, నియోరియలిస్టిక్ నాన్-కమర్షియల్ ఆర్ట్ సినిమా' స్క్రీన్ మీద రన్ అవుతూంటే కక్కలేక, మింగలేక, గొంతుపూడుకుపోయిన టైం లో కరెక్ట్ గా తేలు కుడితే అరవడానికి కూడా వీలు లేకపోయినట్టుగా గిలగిలలాడిపోయారు కుర్రాళ్ళు. అన్నట్టు 'పాప-పాప-పాప' స్టోరీ చెప్పడం మరిచిపోయాను. ఈ సినిమా లో రష్మి మాంఛి బలమైన, బరువైన, దృఢమైన ....వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ చేసింది ముగ్గురు పిల్లల తల్లిగా. ఆమె తన ముగ్గురు పాపల్ని తీసుకుని అడవికి పిక్నిక్ కి వెళ్తుంది ఫస్ట్ సీన్ లో. అప్పుడు ఆ ముగ్గురు పాపలు అడవి లో తప్పిపోతారు.అక్కడ టైటిల్స్. చివరికి ఆ ముగ్గురు పాపలు (పాప-పాప-పాప) వాళ్ళ అమ్మని క్లైమాక్స్ లో కలుసుకునే ఉత్కంఠభరితమైన సీన్ సినిమా కి ఆయువుపట్టు. అయితే సినిమా ఆద్యంతం మళయాళ బాంబు రష్మి ఒకే ముదురు రంగు గళ్ళచీరలో డిగ్నిఫైడ్ గా కనిపించడం ఇంకొక ఆయువుపట్టు. ఇంటర్వల్ కి పావు గంటముందు పిల్లలు ఎంతకీ కనిపించని సన్నివేశం లో వచ్చే ట్రాజెడీ సాంగ్ ఒక ఆయువుపట్టు అయితే, ఆ సాంగ్ ప్లేబ్యాక్ రష్మి, ఆ మళయాళీ డైరెక్టర్ కలిసి పాడటం ఇంకొక ఆయువుపట్టు. ఈ ట్రాజెడీ సాంగ్ ట్యూన్ కొసం మ్యూజిక్ డైరెక్టర్ ఒక అయ్యప్పస్వామి భజన గీతాన్ని యాజిటీజ్ గా వాడేసుకోవడం ఇంకొక అసలైన ఆయువుపట్టు. అయితే ఒకే విడత లో ఇన్ని ఆయువుపట్లని తట్టుకోలేని తెలుగు కుర్రాళ్ళు కొంత వయొలెంట్ అయిపోయి దాదాపుగా మార్నింగ్ షో పడ్డ థియేటర్స్ అన్నింటిలోనూ తెరలు చించేసి, మాగ్జిమం ప్లేసెస్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ ని చితకబాదేసి, కొన్నిచోట్ల సైకిల్ స్టాండ్ కుర్రాణ్ణి చెట్టుకు కట్టేసి, ఇలా భిన్న రూపాలలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసారు. హర్తాళ్ళు చేసి, ఆందోళనకి దిగి ఎలాగయితేనేం, మొత్తానికి రాష్ట్రం మొత్తమ్మీద ఎక్కడా మ్యాట్నీ షో పడకుండా బాక్సులు వెనక్కిపంపించేసారు. అప్పుడెప్పుడో మూడు దశబ్దాల క్రితం ఈవినింగ్ షో తర్వాత బాక్సులన్నీ వెనక్కి వెళ్ళిపోయి సంచలనం సృష్టించిన 'కాడెద్దు-ఎకరం నేల ' సినిమా రికార్డులన్నీ పాప-పాప-పాప సునాయసంగా తిరగరాసింది. పాపిరాజు జాతకం తిరగబడింది. అలా అప్పుడు తెరమరుగైన పాపిరాజు ఇన్నేళ్ళకి తెరపైకొచ్చి తన నాలుగో సినిమా అనౌన్స్ చేసాడు. అందుకే అంత సంచలనం.

సినిమా మొదలయింది:
హితేష్, తేజస్వి, పాపిరాజు ల కాంబినేషన్ లో సినిమా మొదలయింది. ఏదో స్కూల్ మూణ్ణెళ్ళకి అద్దెకి తీసుకున్నారు. డే టైంస్ లో 'కొన్ని క్లాస్ రూం సీన్స్ ' తీసారు. ఈవినింగ్ టైంస్ లో క్లాస్ రూం లో 'కొన్ని సీన్స్ ' తీశారు. ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా షూటింగ్ జరుగుతోంది. సగం షూటింగ్ అయిపోయిందన్నారు డైరెక్టర్, రైటర్ వచ్చి. పాపిరాజు మొత్తానికి ధైర్యం కూడదీసుకుని డైరెక్టర్ ని అడిగేశాడు - 'ఇంతకీ మన సినిమా స్టోరీ ఏంటి ?' అని. 'కథ చెప్పాలంటే మూడ్ రావాలి' అన్నాడు డైరెక్టర్. వెంటనే ఒక రూం లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. గంట సేపు యోగా, గంట సేపు మెడిటేషన్, అరగంట గీతా పఠనం చేసి బయటికి వచ్చాడు. పాపిరాజు ని కూర్చోబెట్టుకుని కథ చెప్పాడు రెండు నిమిషాల్లో- "ఇదొక ఫుల్ ఫ్లెడ్జ్ డ్ యూత్ ఫుల్ కామెడీ, మిక్స్ద్ విత్ రొమాన్స్. సెమీ అర్బన్ సెమీ రూరల్ బ్యాక్ డ్రాప్. ఇంటర్వల్ కి ముందు చిన్న సస్పెన్స్ ఉంటుంది, క్లైమాక్స్ కి ముందు చిన్న సెంటిమెంట్ ఉంటుంది. ఇదీ మన కథ". ఒక్కముక్క కూడా అర్థం కాలేదు పాపిరాజుకి. నాకు పూర్తి కథ చెప్పమన్నాడు. పాపిరాజు వంక జాలిగా ఒక చూపు చూసి లేచివెళ్ళిపోయాడు డైరెక్టర్. కాసేపయాక రైటర్, డైరెక్టర్ పాపిరాజు దగ్గరికి వచ్చి గంభీరంగా బేస్ వాయిస్ లో కోరస్ గా అన్నారు - "మీరేమీ టెన్షన్ పడకండి రాజు గారూ, మన సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుంది".

ఈ లోగా లిరిసిస్ట్ చంద్రకాంత్ వచ్చాడు సెట్ కి. అతన్ని ఈ సినిమాకి టైటిల్ సజెస్ట్ చేయమని అడిగాడు డైరెక్టర్. అయితే ఆ టైటిల్ (1) ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అని జనాలకి అర్థం అయేలా వుండాలి. (2) క్యాచీ గా టీజింగ్ గా వుండాలి (3) సినిమా మీద క్యూరియాసిటీ పెంచేలా వుండాలి - అన్నాడు డైరెక్టర్. వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా ఏ మాత్రం ఆలోచించకుండా అసలు ఆలోచనే లేకుండా ఒక టైటిల్ చెప్పాడు చంద్రకాంత్. ఒక్క క్షణం పిన్-డ్రాప్ సైలెన్స్. వెంటనే చప్పట్లతో మార్మోగిపోయింది అక్కడంతా. అంత ఇన్స్టంటేనియస్ గా అంత యాప్ట్ టైటిల్ ఇచ్చినందుకు పొగడ్తల్లో ముంచెత్తారు చంద్రకాంత్ ని అందరూ. అయితే ప్రొడ్యూసర్ మాత్రం టైటిల్ కొంచెం ఇబ్బందికరంగా వుంది, సెన్సార్ ప్రాబ్లెంస్ వస్తాయేమో అన్నాడు. చంద్రకాంత్ చిద్విలాసంగా నవ్వి, ఇంచుమించు ఇదే లైన్స్ లో తానే గతం లో ఒక సినిమా కి రాసిన పాట వినిపించాడు. అప్పుడా పాటని ఓకే చేసారు కాబట్టి ఇప్పుడు ఈ టైటిల్ ని కూడా చచ్చినట్టు ఓకే చేయాల్సిందే సెన్సార్ వాళ్ళు అని లాజిక్ తీశాదు. ఇంతకీ ఆ టైటిల్ చెప్పనేలేదు కదూ -

టైటిల్: వేయించుకుంటె బాగుంటది (కాప్షన్: ఎర్రని గాజులు నీ చేతికీ)

షూటింగ్ అయిపోయింది. సినిమా ని సెన్సార్ కి పంపించారు. 'న్యాయంగా ' అయితే 'కటింగ్స్ ' అవీ పోనూ సగం సినిమా మాత్రమే బయటికి వస్తుందన్నారు సెన్సార్ వాళ్ళు ( దాంతో పాటే - 'కటింగ్స్ ' అవీ పోనూ వాళ్ళ శాలరీ ఎంత తక్కువగా వస్తుందో కూడా చెప్పారు పాపిరాజుకి). సరే, బోర్డ్ మెంబర్లందరికీ 'తగిన న్యాయం' చేసాడు పాపిరాజు. క్లీన్- యు వచ్చింది. అయితే ఒక మహిళాధికారి మాత్రం టైటిల్ ఇబ్బంది గా వుంది, మార్చాల్సిందేనని పట్టుబట్టింది. స్వల్పమార్పులతో ఇంకొక టైటిల్ ఆమే సూచించింది. సరేనన్నాడు పాపిరాజు. అదే తన జీవితాన్ని మరోసారి మలుపు తిప్పబోతోందని ఆ క్షణాన పాపిరాజుకి తెలీదు. ఇంతకీ ఆమె సూచించగా ఫైనల్ గా ఖరారైన టైటిల్ :

టైటిల్: ఎర్రని గాజులు (కాప్షన్: నీ చేతికి బాగుంటాయి)

సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి ఆఖరిఘట్టం పోస్టర్ డిజైన్ చేసి, సినిమా రిలీజ్ చేయడం. డైరెక్టర్, రైటర్ తమ తదుపరి సినిమా కథ వండటానికి బ్యాంకాక్ వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఒక అప్-కమింగ్, క్రియేటివ్, ఇన్నోవేటివ్ కుర్ర డిజైనర్ ని పాపిరాజుకి సజెస్ట్ చేసారు. కుర్రాడిలో ఏదో కొత్తగా చేయాలన్న తపన, తాపత్రయం విచ్చలవిడిగా వున్నాయి. గత ఏడాది చివర్లో - హీరోహీరోయిన్లని కానీ సన్నివేశాలని కానీ పోస్టర్ మీద చూపించకుండా కోతిబొమ్మలతో వెరైటీ పబ్లిసిటీ చేసి హిట్టు కొట్టిన 'నచ్చావులే ' సినిమా ప్రభావం కుర్రాడి మీద బాగా వుంది. పాపిరాజు టైటిల్ చెప్పగానే అదే తరహా లో ఒక పోస్టర్ డిజైన్ చేసాడు. పెద్ద పోస్టర్. చాలా పెద్దది. తెల్ల బ్యాక్-గ్రౌండ్. రకరకాల గాజులు. రంగు రంగుల గాజులు. చిట్టి చిట్టి గాజులు. మధ్యలో పెద్ద ఎర్ర గాజులు. పోస్టర్ రిలీజ్ చేసారు- రాష్ట్రమంతా.

సినిమా రిలీజ్ అయింది:
ఎక్కడా పోస్టర్ మీద హీరోహీరోయిన్స్ లేకపోవడం తో సినిమా జెనర్ అర్థం కాక కొందరు, ఎర్రని గాజులు అన్న టైటిల్ కి జడిసి కొందరు, పాపిరాజు గారి ప్రీవియస్ ఫిలిం దెబ్బనుండి ఇప్పటికీ కోలుకోక కొందరు - ఏదయితేనేం, మొత్తానికి యూత్ మొత్తం సినిమా కి మొహం చాటేసారు. అయితే, పోస్టర్, టైటిల్ చూసాక అనూహ్యంగా మహిళల్లో ఒక వర్గం ప్రేక్షకులు సినిమా మీద ఆసక్తి పెంచుకున్నారు. అందునా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి బిపాసా దేవి గారు ఎర్రని గాజులు అన్న టైటిల్ మీద హర్షం ప్రకటించి, పోస్టర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసాక సినిమా పట్ల ఆ వర్గానికి ఆసక్తి ద్విగుణీకృతం అయింది. ఇంటలెక్చువల్ మహిళలు, మహిళా సంఘాలవాళ్ళు, రిటైరయాక సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెంచుకున్న మహిళామణులు, మంచి సినిమా ని బతికించాలన్న ధ్యేయం కలిగిన కళాపోషకమారాణులు - తరలి వచ్చారు. మార్నింగ్ షో మొదలయింది. థియేటర్ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి కి లోనయింది. గత పదేళ్ళలో అడపాదడపా కొన్ని సినిమాలు చూసినట్లయితే అంతలా నిర్ఘాంతపోయేవాళ్ళు కాదేమో కానీ అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది చివరిగా చూసిన తెలుగు సినిమా 'అక్క పెత్తనం, చెల్లెలి కాపురం ' అంట. ఇంకేముంది, ఆర్నెల్ల కఠోర పథ్యం తర్వాత డైరెక్ట్ గా గొడ్డు కారం వేసిన మటన్ పులుసు తిన్న వాళ్ళలా అల్లాడిపోయారు. తెర మీద నడుస్తున్న 'సోషల్' ఫాంటసీ, 'సైన్స్' ఫిక్షన్, 'తెలుగు' క్లాస్ రూం థ్రిల్లర్ లోని 'ఇంగ్లీష్' సన్నివేశాలు చూడలేక బిక్కచచ్చిపోయారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారిగా అన్ని మహిళా సంఘాలు కలిపి ఒకే నిర్ణయాన్ని తీసుకున్నాయి. భీబత్సమైన పోరాటపటిమని ప్రదర్శించి రాష్ట్రం లో ఎక్కడా ఈ సినిమా ఇంటర్వల్ అయాక సెకండాఫ్ ప్రదర్శించకుండా చేసి, ఇంటర్వల్ కే బాక్సులన్నీ వెనక్కి పంపించేసారు. ఆ విధంగా 'పాప-పాప-పాప ' తో మార్నింగ్ షో తర్వాత బాక్సులు వెనక్కి వచ్చి రికార్డ్ క్రియేట్ చేసిన పాపిరాజు తన రికార్డుని తానే బద్దలు కొట్టుకున్నాడు.

ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. అయితే పాపిరాజు కి ఒక చిన్న డౌట్ మాత్రం మిగిలిపోయింది. తన జీవితం సగమే నాశనం అయిందా లేక సర్వనాశనం అయిందా అని. ఈ లోగా ఎవరో వచ్చి చెప్పారు - "సార్, మీ సమగ్ర ఇంటర్వ్యూ కోసం 'ఫిలింగోయర్ ' వెబ్సైట్ నుంచి ప్రముఖ జర్నలిస్ట్ 'విభు' గారొచ్చారు" అని.

డౌట్ తీరిపోయింది పాపిరాజుకి.

Sunday, February 22, 2009

యండమూరి " వీళ్ళని ఏం చేద్దాం?" - అబ్సర్డ్ రివ్యూ.

మొన్నీమధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ పుస్తకాన్ని. దాదాపు పదేళ్ళ విరామం తర్వాత యండమూరి వ్రాసిన నవల ఇది. ఈ పదేళ్ళూ విజయానికి 5 మెట్లు, విజయానికి ఆరో మెట్టు, విజయం లో భాగస్వామ్యం..ఇత్యాది 'విజయ 'వంతమైన పుస్తకాలు వ్రాస్తూ నవలలు గట్రా పూర్తి గా పక్కన పెట్టేసిన యండమూరి, ఈ సారి కొత్తగా 'అబ్సర్డ్ థ్రిల్లర్ ' అంటూ వచ్చాడు 'వీళ్ళని ఏం చేద్దాం' తో! మరి ఈ అబ్సర్డ్ థ్రిల్లర్ ఎలా ఉంది, దాని కథా కమామీషు ఏంటో చూద్దాం.


అసలు ఈ 'అబ్సర్డ్ ' గోల ఏంటి??


అబ్సర్డ్ కథ, అబ్సర్డ్ నాటకం, అబ్సర్డ్ నవల అని మూడు ప్రక్రియల్ని ప్రస్తావించాడు యండమూరి ఇందులో.

అబ్సర్డ్ కథ - కథ లో కొన్ని సంఘటన ల కి లింకులు వుండవు. కావాలనే రచయిత ఆ విధంగా లింకులు తొలగిస్తాడన్న మాట. దాంతో పాఠకులు చదివేటపుడు ఒక రకంగా అయోమయం చెందుతారు. అలా అయోమయానికి గురి చేయడమే రచయిత ఉద్దేశ్యం కూడా.
అబ్సర్డ్ నాటకం - సామ్యూల్ బకెట్ వ్రాసిన 'వెయిటింగ్ ఫర్ గాడాట్' అనే అబ్సర్డ్ నాటకాన్ని ప్రస్తావిస్తాడు. ఆకులు రాలిపోయిన చెట్టు కింద ఇద్దరు వృధ్ధులు నిర్మానుష్యమైన రోడ్డు కేసి చూస్తూ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలీదు. వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నది మాత్రం గోడో అనే వ్యక్తి కోసం. ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి వస్తాడో, ఎందుకు వస్తాడో ఇద్దరికీ తెలీదు. తెలీని వ్యక్తి రాక కోసం ఇద్దరు అపరిచితులు రెండు గంటల పాటు జరిపే అసంబద్ద సంభాషణే 'వెయిటింగ్ ఫర్ గాడాట్'. దీనికే సామ్యూల్ బకెట్ కి 1969 లో నోబెల్ ప్రైజ్ వచ్చింది.
అబ్సర్డ్ నవల - తెలుగు లో ఇంతకు ముందు అబ్సర్డ్ నవల అని క్లెయిం చేసుకుంటూ ఏదయినా నవల వచ్చిందో రాలేదో నాకు తెలీదు (నాకు తెలిసినంత వరకు రాలేదు..అట్ లీస్ట్ కమర్షియల్ నవలలలో). కాల పరం గా 'వీళ్ళని ఏం చేద్దాం' కథాంశం కొన్ని దశాబ్దాల క్రితం జరుగుతుంది. అయితే ఆయా సంఘటనల్లో సెల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్ లు కథ లో భాగంగా కనిపిస్తాయి. ఆ రోజుల్లో మరి ఈ సెల్ ఫొన్లు వగైరా లేవు కదా అని మనం సందేహించే లోపే రచయిత మనల్ని హెచ్చరిస్తాడు - ఇది 'అబ్సర్డ్ రచన ' అని, ఇలాంటి అయోమయాలు ముందు ముందు చాలా వుంటాయి అనీ, అలాంటి లాజిక్ లు పక్కన పెట్టి చదవమనీ. అలాగే ఆ తర్వాత ఒక పేజీ పూర్తిగా మనం చదవలేనంత గా బ్లర్ అయి వుంటుంది. ప్రింటింగ్ మిస్టేక్ ఏమో అనుకుని ముందుకు సాగిపోతాం. మళ్ళీ తర్వాత రెండు పేజీలు ప్రింటింగ్ ఏమీ లేకుండా ఖాళీ గా వుంటాయి. పుస్తకం కొనే ముందు చూసుకుని వుండాల్సింది అనుకుంటాం. కానీ ఆ తర్వాత రచయిత సగర్వంగా ప్రకటించేస్తాడు - ఇవన్నీ ఉద్దేశ్యపూర్వకంగా చేసినవేనని. సస్పెన్స్ రివీల్ చేయడం ఇష్టం లేకనే ఒక సీన్ లొ పేజి మొత్తాన్ని బ్లర్ చేసారట. అబ్సర్డ్ రచన. రెండు పేజీలు ఖాళీ గా వదలడం కూడా అబ్సర్డ్ రచన లో భాగమేనట.

ఇంతకీ కథేంటి??

(spoilers ahead)


మహర్షి అనే రచయిత మరణించి భగవంతుని దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ తన కన్నా ముందు వచ్చిన ఒక నలుగురిని భగవంతుడు చెడామడా తిడుతుంటాడు. ఆ నలుగురూ జనాల సొమ్ము ని విపరీతంగా దోచుకుని నాలుగైదు తరాలకి విచ్చలవిడి గా ఖర్చు చేయడానికి సరిపడా సంపాదించిన -ఒక రాజకీయ నాయకుడు, ఒక కాంట్రాక్టర్, ఒక మాఫియా లీడర్, ఒక ప్రభుత్వ అధికారి. భగవంతుడు వాళ్ళ తో "మీరు మీకు, మీ పిల్లలకి సంపాదిస్తే చాలు. కానీ మీ మనవళ్ళకి, ముని మనవళ్ళకి సంపాదించవలసిన అవసరం ఏంటి? అది కూడా జనం ఉసురు పోసుకుని జనం సొమ్ము దోచిపెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీరు సంపాదించి పెట్టిన సంపద ను ఇప్పుడు భూమి మీద మీ మూడో తరం (మనవళ్ళ కొడుకులు/కూతుళ్ళు) అనుభవిస్తున్నారు. మీరు సంపాదించిపెట్టిన భిక్ష ని అనుభవిస్తున్న వాళ్ళలో ఏ ఒక్కరి దగ్గరయినా కనీసం మీ ఫోటో వుంటే వెతికి పట్టుకుని తీసుకు రమ్మని అలా తీసుకు వస్తే శిక్ష తగ్గిస్తానని " సవాల్ చేస్తాడు. నెల రోజులు గడువిస్తాడు. నెల తర్వాత తాము సంపాదించినది అనుభవిస్తోన్న తమ వారసులకి ఎవరికీ తాము ఎవరో, ఎలా వుంటామో కూడా తెలీదని, ఒక్కరు కూడా కనీసం తమ ఫోటో దాచుకోలేదని తెల్సుకుని తీవ్ర నిరాశ తో భగవంతుని వద్దకి తిరిగి వచ్చి తాము గడిపినది నిరర్థకమయిన జీవితం అని అంగీకరిస్తారు. ఇక మహర్షి సంగతి. కీర్తి కండూతి లో పడి జీవితం లో (భార్య తో సహా) చాలా కోల్పోయిన ప్రతిభావంతుడైన రచయిత మహర్షి. భగవంతుడు అతనికి అప్పగించిన పని ప్రస్తుతం భూమి మీద వున్న భరద్వాజ అనే మరో ప్రతిభావంతుడైన రచయిత తో ముడిపడి వుంది.


సాహిత్య అకాడెమి అవార్డ్ గ్రహీత అయిన పాపులర్ రచయిత భరద్వాజ ని ఒక రాజకీయ నాయకుడు పిలిపిస్తాడు. తాను అంతు లేనంత ఆస్తి సంపాదించాననీ, తన పిల్లలు, పిల్లల పిల్లలు, తన సోదరుల మనవళ్ళు అందర్నీ రేపటి తన పుట్టిన రోజు కోసం పిలిపించాననీ, వాళ్ళని ఉద్దేశ్యించి తన పుట్టిన రోజున భరద్వాజ ను ఒక స్పీచ్ ఇవ్వమని కోరతాడు. విపరీతమయిన ఆస్తి రావడం వల్ల తన మనవళ్ళ తరం టీనేజ్ వచ్చే సరికే పూర్తి గా నాశనం అయిందనీ, తరం మొత్తం పూర్తిగా విలాసాల్లో మునిగి తేలుతూ ఉన్నారనీ, గంజాయి, హెరాయిన్, రేసులు, పేకాట, పిక్నిక్ లు, విదేశీ ప్రయాణాలు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అబార్షన్స్, ఎయిడ్స్- ఇదీ వాళ్ళ జీవితం అనీ, జీవితం అంటే కేవలం విలాసం, ఆనందించడం మాత్రమే కాదు అని వాళ్ళకి అర్థం అయేలా చెప్పాలని అర్థిస్తాడు. అయితే భరద్వాజ కూడా ఇప్పుడిప్పుడే కీర్తి కండూతి ని వంటబట్టించుకుంటూ డబ్బు, గుర్తింపు తప్ప ప్రపంచం లో ఇంకేదీ అక్కర్లేదనే భ్రమ తో తన భార్యకి, కుటుంబానికి మానసికంగా దూరమవుతూ వున్నాడు. సో, భరద్వాజ కి సరయిన దిశా నిర్దేశం చేయడం, భరద్వాజ స్పీచ్ ద్వారా ఒక వంశం లో ని ఒక తరాన్ని జాగృతం చేయడం అనేది భగవంతుడు మహర్షి కి అప్పచెప్పిన కార్యం. దీన్ని మహర్షి ఎలా సాధించాడు అనేది పాఠకుడి ని కొంత అయోమయానికి గురి చేస్తూ, లాజిక్ కి అందీ అందకుండా అబ్సర్డ్ గా సాగుతూ ఒక చిన్న ట్విస్ట్ తో ముగుస్తుంది.

కమామీషు:

1. ఇందులో రచయిత చాలా సార్లు ప్రస్తావించే ఒక టాపిక్ - ఆంత్రొపాలాజీ. మానవుని ఆలోచనల్లో ని పరిణామ క్రమం. ఉద్యోగ వేట లో నగరానికి వచ్చి కొత్తగా వచ్చిపడ్డ స్వేచ్చ ని ఏం చేసుకోవాలో తెలీని అమ్మయిలు (ఈ సన్నివేశాలు యండమూరి వ్రాసిన 'లేడీస్ హాస్టల్' నవల కి కొనసాగింపు లాగా వుంటాయి), ఇటీవలి కాలం లొ సాధారణమైపోయిన ప్రేమ పేరిటి యాసిడ్ దాడులలోని అవతలి కోణం, కార్పొరేట్ కల్చర్ లో మనం తరచూ వినే ఆఫీస్ స్పౌజ్ సంస్కృతి, ఈ మధ్య యువతీ యువకుల్లో ఫ్యాషన్ అయిపోయిన లివ్-ఇన్ రిలేషన్స్ - వీటన్నిటినీ రచయిత చర్చించాడు, వీటి మీద చురకలు వేయడానికి ప్రయత్నించాడు.

2. విజయానికి 5 మెట్లు సహా యండమూరి వ్రాసిన పలు పుస్తకాల్లో కనిపించే 'మెటా ఫిజికల్ ఎంటీనెస్ ' అనే టాపిక్ ఈ పుస్తకం లో నూ రెండు మూడు చోట్ల కనిపిస్తుంది. బహుశా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైం లో రచయిత కి ఒక్కొక్క ఫేవరెట్ టాపిక్ వుంటుందేమో. (అది అతని స్టేట్ ఆఫ్ మైండ్ టాపిక్ అనుకోవచ్చా?)

3. మనం చిన్నపుడు చదువుకున్న Ant & grasshopper కథ కి ఎక్స్టెన్షన్ లా గా వచ్చిన ఒక ఫార్వర్డ్ మెయిల్ చాలా మంది చదివే వుంటారు. కష్టపడని grasshoppers ని సపోర్ట్ చేసే మన ఉద్యమకారులమీద, రాజకీయ నాయకుల మీద సెటైర్ అది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఒక చోట వాడుకున్నారు.


4. ఇక కొన్ని కారెక్టర్స్ ని చూస్తే వాస్తవ జీవితం లోని కొందరు గుర్తుకు వచ్చారు. ప్రమోద్ మహాజన్, రాహుల్ మహాజన్ ల జీవితాల్లోని సంఘటన లని మిక్స్ చేసి ఒకే కారెక్టర్ గా రూపొందించినట్టు అనిపిస్తుంది ప్రమోద్ బానీ అనే స్పాయిల్డ్ బ్రాట్ కారెక్టర్ ని చూస్తే. అలాగే విశ్వనాథ రెడ్డి అనే కాంట్రాక్టర్ పాత్ర చూస్తే ఎందుకో టి. సుబ్బిరామిరెడ్డి గుర్తుకు వచ్చాడు.

5. వెన్నెల్లో ఆడపిల్ల (పొయెటిక్ లవ్ స్టోరీ), అంతర్ముఖం (ఫిలసాఫికల్ స్టోరీ) , తులసీ దళం (హారర్/ క్షుద్ర) లాంటి ఇంటరెస్టింగ్ గా వుంటూనే జెనర్ ని కరెక్ట్ గా కన్వే చేయగలిగిన టైటిల్స్ తో పోలిస్తే "వీళ్ళని ఏం చేద్దాం" అనేది చాలా సాదసీదా టైటిల్ లా అనిపించింది నాకు. కనీసం ఫిక్షనా నాన్ ఫిక్షనా అన్నది కూడా టైటిల్ ని చూసి గెస్ చేయలేం.

6. మొదట్లో భగవంతుని తో ఆర్గ్యుమెంట్స్, ప్రతినిధి-4 వగైరా ల అతీంద్రియ శక్తులు - మనం వద్దనుకున్నా యండమూరి నవలలు అంతర్ముఖం, థ్రిల్లర్ (ముత్యమంత ముద్దు సినిమా) లని గుర్తు చేస్తాయి. అయితే నవల రెండో భాగం లో ఎక్కువగా (కథాంశం రీత్యా) రచయితల ఆలోచనాతీరు నీ, రచయితల ప్రపంచాన్నీ ప్రెజెంట్ చేస్తాడు. కొంతమందికీ ఆసక్తికరంగా వుంటుంది, కొంతమంది కి పేజీలు తిప్పేద్దామనిపిస్తుంది. అదీ కాక చెప్పాల్సిన అంశం కంటే చెప్పే విధానమే ఎక్కువ ఆసక్తి కలిగించడం చూస్తే 'అబ్సర్డ్ నవల ' అనే ప్రక్రియ ని తెలుగు పాఠకులకి రుచి చూపిద్దామనే ఉద్దేశ్యం తో మాత్రమే పుస్తకం వ్రాశారేమో అనిపించింది. ఏది ఏమయినా నన్ను మాత్రం ఏకబిగిన చదివించేసింది.

ఇంతకీ దీన్ని అబ్సర్డ్ రివ్యూ అని ఎందుకన్నట్టో??

నాకు తెలిసి అయితే నేను ఎటువంటి లింకులూ తొలగించలేదు ఈ రివ్యూ లో. పాఠకుల్ని ఉద్దేశ్య పూర్వకంగా అయోమయానికి గురి చేసే ఐడియా కూడా నాకయితే లేదు. అయినప్పటికిన్నీ నా అయోమయం వల్లనో, అనుభవరాహిత్యం వల్లనో, నాకు అంత 'సీన్' లేకపోవడం వల్లనో ఎక్కడైనా మీరు అయోమయానికి గురి అయితే లేదా ఈ రివ్యూ లో నేను ఏవయినా మిస్ చేసానని మీకు అనిపిస్తే దాన్ని నా మిస్టేక్ లా కాకుండా - రివ్యూయరే బా..గా.. ఇంటలెక్చువల్ గా ఆలోచించి ఆ లింకులు తీసివేసి వుంటాడని మీరు అనుకోవాలనేదే నా కుటిలమైన ఆలోచన..
అందుకోసమనే 'అబ్సర్డ్ రివ్యూ' అనే టైటిల్ పెట్టానన్నమాట!!(:-