Sunday, February 22, 2009

యండమూరి " వీళ్ళని ఏం చేద్దాం?" - అబ్సర్డ్ రివ్యూ.

మొన్నీమధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ పుస్తకాన్ని. దాదాపు పదేళ్ళ విరామం తర్వాత యండమూరి వ్రాసిన నవల ఇది. ఈ పదేళ్ళూ విజయానికి 5 మెట్లు, విజయానికి ఆరో మెట్టు, విజయం లో భాగస్వామ్యం..ఇత్యాది 'విజయ 'వంతమైన పుస్తకాలు వ్రాస్తూ నవలలు గట్రా పూర్తి గా పక్కన పెట్టేసిన యండమూరి, ఈ సారి కొత్తగా 'అబ్సర్డ్ థ్రిల్లర్ ' అంటూ వచ్చాడు 'వీళ్ళని ఏం చేద్దాం' తో! మరి ఈ అబ్సర్డ్ థ్రిల్లర్ ఎలా ఉంది, దాని కథా కమామీషు ఏంటో చూద్దాం.


అసలు ఈ 'అబ్సర్డ్ ' గోల ఏంటి??


అబ్సర్డ్ కథ, అబ్సర్డ్ నాటకం, అబ్సర్డ్ నవల అని మూడు ప్రక్రియల్ని ప్రస్తావించాడు యండమూరి ఇందులో.

అబ్సర్డ్ కథ - కథ లో కొన్ని సంఘటన ల కి లింకులు వుండవు. కావాలనే రచయిత ఆ విధంగా లింకులు తొలగిస్తాడన్న మాట. దాంతో పాఠకులు చదివేటపుడు ఒక రకంగా అయోమయం చెందుతారు. అలా అయోమయానికి గురి చేయడమే రచయిత ఉద్దేశ్యం కూడా.
అబ్సర్డ్ నాటకం - సామ్యూల్ బకెట్ వ్రాసిన 'వెయిటింగ్ ఫర్ గాడాట్' అనే అబ్సర్డ్ నాటకాన్ని ప్రస్తావిస్తాడు. ఆకులు రాలిపోయిన చెట్టు కింద ఇద్దరు వృధ్ధులు నిర్మానుష్యమైన రోడ్డు కేసి చూస్తూ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలీదు. వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నది మాత్రం గోడో అనే వ్యక్తి కోసం. ఆ వ్యక్తి ఎప్పుడు వస్తాడో, ఎక్కడికి వస్తాడో, ఎందుకు వస్తాడో ఇద్దరికీ తెలీదు. తెలీని వ్యక్తి రాక కోసం ఇద్దరు అపరిచితులు రెండు గంటల పాటు జరిపే అసంబద్ద సంభాషణే 'వెయిటింగ్ ఫర్ గాడాట్'. దీనికే సామ్యూల్ బకెట్ కి 1969 లో నోబెల్ ప్రైజ్ వచ్చింది.
అబ్సర్డ్ నవల - తెలుగు లో ఇంతకు ముందు అబ్సర్డ్ నవల అని క్లెయిం చేసుకుంటూ ఏదయినా నవల వచ్చిందో రాలేదో నాకు తెలీదు (నాకు తెలిసినంత వరకు రాలేదు..అట్ లీస్ట్ కమర్షియల్ నవలలలో). కాల పరం గా 'వీళ్ళని ఏం చేద్దాం' కథాంశం కొన్ని దశాబ్దాల క్రితం జరుగుతుంది. అయితే ఆయా సంఘటనల్లో సెల్ ఫోన్లు, వీడియో రికార్డింగ్ లు కథ లో భాగంగా కనిపిస్తాయి. ఆ రోజుల్లో మరి ఈ సెల్ ఫొన్లు వగైరా లేవు కదా అని మనం సందేహించే లోపే రచయిత మనల్ని హెచ్చరిస్తాడు - ఇది 'అబ్సర్డ్ రచన ' అని, ఇలాంటి అయోమయాలు ముందు ముందు చాలా వుంటాయి అనీ, అలాంటి లాజిక్ లు పక్కన పెట్టి చదవమనీ. అలాగే ఆ తర్వాత ఒక పేజీ పూర్తిగా మనం చదవలేనంత గా బ్లర్ అయి వుంటుంది. ప్రింటింగ్ మిస్టేక్ ఏమో అనుకుని ముందుకు సాగిపోతాం. మళ్ళీ తర్వాత రెండు పేజీలు ప్రింటింగ్ ఏమీ లేకుండా ఖాళీ గా వుంటాయి. పుస్తకం కొనే ముందు చూసుకుని వుండాల్సింది అనుకుంటాం. కానీ ఆ తర్వాత రచయిత సగర్వంగా ప్రకటించేస్తాడు - ఇవన్నీ ఉద్దేశ్యపూర్వకంగా చేసినవేనని. సస్పెన్స్ రివీల్ చేయడం ఇష్టం లేకనే ఒక సీన్ లొ పేజి మొత్తాన్ని బ్లర్ చేసారట. అబ్సర్డ్ రచన. రెండు పేజీలు ఖాళీ గా వదలడం కూడా అబ్సర్డ్ రచన లో భాగమేనట.

ఇంతకీ కథేంటి??

(spoilers ahead)


మహర్షి అనే రచయిత మరణించి భగవంతుని దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ తన కన్నా ముందు వచ్చిన ఒక నలుగురిని భగవంతుడు చెడామడా తిడుతుంటాడు. ఆ నలుగురూ జనాల సొమ్ము ని విపరీతంగా దోచుకుని నాలుగైదు తరాలకి విచ్చలవిడి గా ఖర్చు చేయడానికి సరిపడా సంపాదించిన -ఒక రాజకీయ నాయకుడు, ఒక కాంట్రాక్టర్, ఒక మాఫియా లీడర్, ఒక ప్రభుత్వ అధికారి. భగవంతుడు వాళ్ళ తో "మీరు మీకు, మీ పిల్లలకి సంపాదిస్తే చాలు. కానీ మీ మనవళ్ళకి, ముని మనవళ్ళకి సంపాదించవలసిన అవసరం ఏంటి? అది కూడా జనం ఉసురు పోసుకుని జనం సొమ్ము దోచిపెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మీరు సంపాదించి పెట్టిన సంపద ను ఇప్పుడు భూమి మీద మీ మూడో తరం (మనవళ్ళ కొడుకులు/కూతుళ్ళు) అనుభవిస్తున్నారు. మీరు సంపాదించిపెట్టిన భిక్ష ని అనుభవిస్తున్న వాళ్ళలో ఏ ఒక్కరి దగ్గరయినా కనీసం మీ ఫోటో వుంటే వెతికి పట్టుకుని తీసుకు రమ్మని అలా తీసుకు వస్తే శిక్ష తగ్గిస్తానని " సవాల్ చేస్తాడు. నెల రోజులు గడువిస్తాడు. నెల తర్వాత తాము సంపాదించినది అనుభవిస్తోన్న తమ వారసులకి ఎవరికీ తాము ఎవరో, ఎలా వుంటామో కూడా తెలీదని, ఒక్కరు కూడా కనీసం తమ ఫోటో దాచుకోలేదని తెల్సుకుని తీవ్ర నిరాశ తో భగవంతుని వద్దకి తిరిగి వచ్చి తాము గడిపినది నిరర్థకమయిన జీవితం అని అంగీకరిస్తారు. ఇక మహర్షి సంగతి. కీర్తి కండూతి లో పడి జీవితం లో (భార్య తో సహా) చాలా కోల్పోయిన ప్రతిభావంతుడైన రచయిత మహర్షి. భగవంతుడు అతనికి అప్పగించిన పని ప్రస్తుతం భూమి మీద వున్న భరద్వాజ అనే మరో ప్రతిభావంతుడైన రచయిత తో ముడిపడి వుంది.


సాహిత్య అకాడెమి అవార్డ్ గ్రహీత అయిన పాపులర్ రచయిత భరద్వాజ ని ఒక రాజకీయ నాయకుడు పిలిపిస్తాడు. తాను అంతు లేనంత ఆస్తి సంపాదించాననీ, తన పిల్లలు, పిల్లల పిల్లలు, తన సోదరుల మనవళ్ళు అందర్నీ రేపటి తన పుట్టిన రోజు కోసం పిలిపించాననీ, వాళ్ళని ఉద్దేశ్యించి తన పుట్టిన రోజున భరద్వాజ ను ఒక స్పీచ్ ఇవ్వమని కోరతాడు. విపరీతమయిన ఆస్తి రావడం వల్ల తన మనవళ్ళ తరం టీనేజ్ వచ్చే సరికే పూర్తి గా నాశనం అయిందనీ, తరం మొత్తం పూర్తిగా విలాసాల్లో మునిగి తేలుతూ ఉన్నారనీ, గంజాయి, హెరాయిన్, రేసులు, పేకాట, పిక్నిక్ లు, విదేశీ ప్రయాణాలు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అబార్షన్స్, ఎయిడ్స్- ఇదీ వాళ్ళ జీవితం అనీ, జీవితం అంటే కేవలం విలాసం, ఆనందించడం మాత్రమే కాదు అని వాళ్ళకి అర్థం అయేలా చెప్పాలని అర్థిస్తాడు. అయితే భరద్వాజ కూడా ఇప్పుడిప్పుడే కీర్తి కండూతి ని వంటబట్టించుకుంటూ డబ్బు, గుర్తింపు తప్ప ప్రపంచం లో ఇంకేదీ అక్కర్లేదనే భ్రమ తో తన భార్యకి, కుటుంబానికి మానసికంగా దూరమవుతూ వున్నాడు. సో, భరద్వాజ కి సరయిన దిశా నిర్దేశం చేయడం, భరద్వాజ స్పీచ్ ద్వారా ఒక వంశం లో ని ఒక తరాన్ని జాగృతం చేయడం అనేది భగవంతుడు మహర్షి కి అప్పచెప్పిన కార్యం. దీన్ని మహర్షి ఎలా సాధించాడు అనేది పాఠకుడి ని కొంత అయోమయానికి గురి చేస్తూ, లాజిక్ కి అందీ అందకుండా అబ్సర్డ్ గా సాగుతూ ఒక చిన్న ట్విస్ట్ తో ముగుస్తుంది.

కమామీషు:

1. ఇందులో రచయిత చాలా సార్లు ప్రస్తావించే ఒక టాపిక్ - ఆంత్రొపాలాజీ. మానవుని ఆలోచనల్లో ని పరిణామ క్రమం. ఉద్యోగ వేట లో నగరానికి వచ్చి కొత్తగా వచ్చిపడ్డ స్వేచ్చ ని ఏం చేసుకోవాలో తెలీని అమ్మయిలు (ఈ సన్నివేశాలు యండమూరి వ్రాసిన 'లేడీస్ హాస్టల్' నవల కి కొనసాగింపు లాగా వుంటాయి), ఇటీవలి కాలం లొ సాధారణమైపోయిన ప్రేమ పేరిటి యాసిడ్ దాడులలోని అవతలి కోణం, కార్పొరేట్ కల్చర్ లో మనం తరచూ వినే ఆఫీస్ స్పౌజ్ సంస్కృతి, ఈ మధ్య యువతీ యువకుల్లో ఫ్యాషన్ అయిపోయిన లివ్-ఇన్ రిలేషన్స్ - వీటన్నిటినీ రచయిత చర్చించాడు, వీటి మీద చురకలు వేయడానికి ప్రయత్నించాడు.

2. విజయానికి 5 మెట్లు సహా యండమూరి వ్రాసిన పలు పుస్తకాల్లో కనిపించే 'మెటా ఫిజికల్ ఎంటీనెస్ ' అనే టాపిక్ ఈ పుస్తకం లో నూ రెండు మూడు చోట్ల కనిపిస్తుంది. బహుశా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైం లో రచయిత కి ఒక్కొక్క ఫేవరెట్ టాపిక్ వుంటుందేమో. (అది అతని స్టేట్ ఆఫ్ మైండ్ టాపిక్ అనుకోవచ్చా?)

3. మనం చిన్నపుడు చదువుకున్న Ant & grasshopper కథ కి ఎక్స్టెన్షన్ లా గా వచ్చిన ఒక ఫార్వర్డ్ మెయిల్ చాలా మంది చదివే వుంటారు. కష్టపడని grasshoppers ని సపోర్ట్ చేసే మన ఉద్యమకారులమీద, రాజకీయ నాయకుల మీద సెటైర్ అది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఒక చోట వాడుకున్నారు.


4. ఇక కొన్ని కారెక్టర్స్ ని చూస్తే వాస్తవ జీవితం లోని కొందరు గుర్తుకు వచ్చారు. ప్రమోద్ మహాజన్, రాహుల్ మహాజన్ ల జీవితాల్లోని సంఘటన లని మిక్స్ చేసి ఒకే కారెక్టర్ గా రూపొందించినట్టు అనిపిస్తుంది ప్రమోద్ బానీ అనే స్పాయిల్డ్ బ్రాట్ కారెక్టర్ ని చూస్తే. అలాగే విశ్వనాథ రెడ్డి అనే కాంట్రాక్టర్ పాత్ర చూస్తే ఎందుకో టి. సుబ్బిరామిరెడ్డి గుర్తుకు వచ్చాడు.

5. వెన్నెల్లో ఆడపిల్ల (పొయెటిక్ లవ్ స్టోరీ), అంతర్ముఖం (ఫిలసాఫికల్ స్టోరీ) , తులసీ దళం (హారర్/ క్షుద్ర) లాంటి ఇంటరెస్టింగ్ గా వుంటూనే జెనర్ ని కరెక్ట్ గా కన్వే చేయగలిగిన టైటిల్స్ తో పోలిస్తే "వీళ్ళని ఏం చేద్దాం" అనేది చాలా సాదసీదా టైటిల్ లా అనిపించింది నాకు. కనీసం ఫిక్షనా నాన్ ఫిక్షనా అన్నది కూడా టైటిల్ ని చూసి గెస్ చేయలేం.

6. మొదట్లో భగవంతుని తో ఆర్గ్యుమెంట్స్, ప్రతినిధి-4 వగైరా ల అతీంద్రియ శక్తులు - మనం వద్దనుకున్నా యండమూరి నవలలు అంతర్ముఖం, థ్రిల్లర్ (ముత్యమంత ముద్దు సినిమా) లని గుర్తు చేస్తాయి. అయితే నవల రెండో భాగం లో ఎక్కువగా (కథాంశం రీత్యా) రచయితల ఆలోచనాతీరు నీ, రచయితల ప్రపంచాన్నీ ప్రెజెంట్ చేస్తాడు. కొంతమందికీ ఆసక్తికరంగా వుంటుంది, కొంతమంది కి పేజీలు తిప్పేద్దామనిపిస్తుంది. అదీ కాక చెప్పాల్సిన అంశం కంటే చెప్పే విధానమే ఎక్కువ ఆసక్తి కలిగించడం చూస్తే 'అబ్సర్డ్ నవల ' అనే ప్రక్రియ ని తెలుగు పాఠకులకి రుచి చూపిద్దామనే ఉద్దేశ్యం తో మాత్రమే పుస్తకం వ్రాశారేమో అనిపించింది. ఏది ఏమయినా నన్ను మాత్రం ఏకబిగిన చదివించేసింది.

ఇంతకీ దీన్ని అబ్సర్డ్ రివ్యూ అని ఎందుకన్నట్టో??

నాకు తెలిసి అయితే నేను ఎటువంటి లింకులూ తొలగించలేదు ఈ రివ్యూ లో. పాఠకుల్ని ఉద్దేశ్య పూర్వకంగా అయోమయానికి గురి చేసే ఐడియా కూడా నాకయితే లేదు. అయినప్పటికిన్నీ నా అయోమయం వల్లనో, అనుభవరాహిత్యం వల్లనో, నాకు అంత 'సీన్' లేకపోవడం వల్లనో ఎక్కడైనా మీరు అయోమయానికి గురి అయితే లేదా ఈ రివ్యూ లో నేను ఏవయినా మిస్ చేసానని మీకు అనిపిస్తే దాన్ని నా మిస్టేక్ లా కాకుండా - రివ్యూయరే బా..గా.. ఇంటలెక్చువల్ గా ఆలోచించి ఆ లింకులు తీసివేసి వుంటాడని మీరు అనుకోవాలనేదే నా కుటిలమైన ఆలోచన..
అందుకోసమనే 'అబ్సర్డ్ రివ్యూ' అనే టైటిల్ పెట్టానన్నమాట!!(:-