Wednesday, November 21, 2007

ఐ నో హిందీ బెటర్ దెన్ హిం.

నా ఫ్రెండ్స్ లో చాలా మంది తమిళియన్స్ వున్నారు. వాళ్ళందరికీ కామన్ గా తమిళ బాష లో నచ్చని ఒకే ఒక్క డైలాగు - 'హిందీ తెరియుమా?' . వీళ్ళందరూ ఈ పుణె శహర్ లో ఇన్నేసి నెలలు/సంవత్సరాల నుండి ఎలా నెట్టుకొచ్చేస్తున్నారని నాకు తెగ డౌట్ వుండేది. ..!!

అప్పట్లో చెన్నై లో ఒకబ్బాయి తగిలాడు. పుణె లో జాబ్ వచ్చింది- నాతో పాటు -అతనూ సేం డే జాయినింగ్, సేం ఫ్లైట్. సరే, ఎయిర్-పోర్ట్ లో కలుద్దాం అని చెప్పా. ఉదయం 7కి ఫ్లైట్ అయితే 5:30 కి నేను మా ఫ్రెండ్ ఒకబ్బాయి (మాత్రమే) ఎయిర్-పొర్ట్ కి వెళ్ళాం. అక్కడికెళ్ళగానే R.B చౌదరి సినిమా లొ క్లైమాక్స్ షాట్ లాగా ఫ్రేం నిండా జనాలు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళూ వీళ్ళూ అబ్బో. అందరూ సేం క్వొశ్చన్ నన్ను - హిందీ తెరియుమా అని. నాకేమో హిందీ తెరియుం. కానీ ఆ విషయం వాళ్ళకి చెప్పడానికి తమిళే తెరియాదు. .! సరే, వాడేమో పుణె వచ్చాక - 'భయ్యా, సైడ్ పే రుకో' అన్న ఒకే ఒక్క సెంటెన్స్ నేర్చేసుకుని - దాంతోనే, వున్నన్ని రోజులూ పుణె ఆటో వాళ్ళని 'గడగడలాడించి' తర్వాత US వెళ్ళిపోయాడు. .!

మా రూం లో ఇంకొక అబ్బాయి వుండేవాడు. తెలుగే కానీ- కుర్రాడి బాల్యము, విద్యాభ్యాసము, బారిష్టర్ చదువులూ మొత్తం చెన్నై లో జరగడం వల్ల హిందీ ఒక్కముక్క కూడా రాకుండా పోయింది. జాబ్ సెర్చింగ్ గురించి పుణె వచ్చాడు. మేమంతా ఆఫీస్ కెళ్తే రూం లో ఒక్కడే వుండేవాడు. వాడికి హిందీ లో 'క్యా' అనే ఒకే ఒక్క పదం (సారీ.. అక్షరం) తప్ప ఏమీ రాదు. అసలు మేమెవరూ లేనప్పుడు పనామె తో హిందీ ఎలా మేనేజ్ చేస్తాడనేది మా పాలిటి కో సస్పెన్స్ థ్రిల్లర్. కూపీ లాగడానికి ఎన్ని సార్లు ఎంత స్ట్రాంగ్ గా ట్రై చేసినా అంత కంటే 'స్ట్రాంగ్' గా ఎదుర్కొనేవాడే తప్పించి విషయం చెప్పేవాడు కాదు. అట్టాంటిది ఒకానొక 'వీక్'ఎండ్, రూం లో కరెంట్ పోయి, 'పిల్ల ' గాలి కోసం మిద్దె మీదకెళ్ళినప్పుడు విషయం చెప్పాడు- మొదట్లో ఆమె ఏమడిగినా క్యా, క్యా అని తప్ప మరో మాట మాటాడకపోవడం తో ఆమే సూక్ష్మం గ్రహించేసి ఒక పుష్పకవిమానం టైప్ సైగబాష కి ఫిక్స్ అయిపోయిందంట. ఇప్పుడూ..రూం లో నీళ్ళు అయిపోయాయనుకోండి..ఆమె డైరెక్ట్ గా వెళ్ళి ఖాళీ బకెట్ ఒక దాన్ని పైకి ఎత్తి ధభేల్ మని కింద పడేసి (నీళ్ళు లేవన్నట్టుగా) చేతులు వూపుతుందంట (మా రూం లో నీళ్ళకు - బోర్ . మేమే మోటార్ వేయాలి). అప్పుడూ..మా వాడేమో గబగబా ఫ్యాన్ స్విచ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ వేసి - తిరగని ఫ్యాన్ వైపు చూపిస్తూ(కరెంట్ లేదన్నట్టు) చేతులు వూపుతాడంట. అదీ సంగతి. అలా మా వాడు కొన్నాళ్ళు 'డంబ్ చారడ్శ్ ' లో ప్రావీణ్యం సంపాదించాక చివరికి బెంగళూర్ వెళ్ళిపోయాడు.

ఇక ఆఫీస్ లో ఇద్దరు ఫ్రెండ్స్ వున్నారు. ఇద్దరూ తమిళే. వాళ్ళిద్దరూ ఆపుడప్పుడూ హిందీ లో మాట్లాడుకుంటారు - లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుందామని. అబ్బో. వాళ్ళు 'నీఛే' ప్లేస్ లో 'పీఛే' , 'పీఛే' ప్లేస్ లో 'నీఛే' పెట్టి మాట్లాడే హిందీని ఏ ఇ.వి.వి సత్యనారాయణ లాంటోడో గనక వింటే ..చచ్చారే.. సెన్సార్ వాళ్ళు..!! వాళ్ళిద్దరికీ మళ్ళీ కాంపిటీషన్. నా హిందీ బాగుందంటే నాది బాగుందని.
ఒక సారి వాళ్ళలో ఒకతనన్నాడు మాతో , రెండో అతన్ని ఉద్దేశ్యించి - 'హే, ఐ నో హిందీ బెటర్ దెన్ హిం యార్ ' అని.
"ఒరే నువ్విదే ముక్క హిందీ లొ చెప్పరా - మేమంతా ఒప్పేసుకుంటాం, యు నో హిందీ బెటర్ దెన్ హిం అని" అని చెప్పా. ఖంగుతిన్నాడు.!!

1 comment:

Unknown said...

:)
అవును మన తమిళ సోదరులకి హిందీ నాలెడ్జ్ కొద్దిగా తక్కువే.
టపా బాగుంది సరదాగా. కామెడీ టచ్ తో మరిన్ని టపాలు రాయండి.