Monday, December 31, 2007
షేక్ సెబాస్టియన్ నాయుడు (ఫ్యాక్షన్ సినిమా స్టోరీ - 200 డేస్ 200 సెంటర్స్ )
ఉపోద్ఘాతం
' నరకానికి నాలుగు అడుగులు ' దాకా వెళ్ళి ఎలాగో బయటపడ్డాం, సినిమా అయిపోవడం తో. అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయి చాలా రోజులు అయినా మేము సాహసం చేయలేదు. కాకపోతే కనబడ్డ ప్రతి ఒక్కడూ ఇండస్ట్రీ హిట్ అంటేనూ ధైర్యం చేసాం.సినిమా చూసాక నా ఆత్మ విశ్వాసం ఘోరంగా దెబ్బ తింది. అస్సలు అర్థం కాలేదు ఆ సినిమా ఎలా హిట్ అయిందా అని.
ఆ రాత్రి-
" బాసూ ఇక లాభం లేదు, మనలని ' నరకానికి నాలుగు అడుగులు ' దాకా తీసుకెళ్ళిన ఆ డైరెక్టర్ కి బుద్ది చెప్పాల్సిందే " అన్నాడు మా ఫ్రెండ్ .
"బుద్ది కాదు, కథ చెప్పాలి " అన్నాడు మా జూనియర్.
అలా మా విన్నూత్న వైవిధ్య ఫ్యాక్షన్ కథ కి అంకురార్పణ జరిగింది.
*********
కథ
అన్ని ఫ్యాక్షన్ సినిమాల్లాగే మన సినిమా కూడా సీమ లో కాకుండా వేరే చోట (ఈ సారి వెరైటీ గా ఒరిస్సాలో ) మొదలవుతుంది.
సెబాస్టియన్ (హీరో) ఒరిస్సా లో ఒక జిం పెట్టుకుని తన ఆరేళ్ళ కొడుకు తో పాటు వుంటాడు. ఆ జిం లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ కామన్ ట్రైనర్ మన హీరో యే. యాజ్ యూజువల్ హీరోయిన్ కూడా ఇదే జిం. ఒక సారి హీరోయిన్ ఏదో ఎక్సర్సైజ్ చేస్తుంటే (ఆ అమ్మాయి బాగానే చేస్తుంటుంది) హీరో వచ్చి ఇది ఇలాగేనా చేయడం అని క్లాస్ పీకి, అది చేయాల్సింది అలా కాదు ఇలా అని చెప్పి (ఆమె కంటే వరస్ట్ గా ) చేసి చూపిస్తాడు. అపుడు హీరోయిన్ 'వ్వావ్ వ్వాటే పవర్' అని ఆశ్చర్యపడుతుంది. కట్ చేస్తే పాట - స్విట్జర్లాండ్ రోడ్డు మీద -
అ: ఓసి నా చద్దన్నం ముద్దా,
నా పవరంటే నీకంత ముద్దా
ఆ: నువ్వే రా జిం లో ట్రైనరు,
నువ్వే నా సోకులకి ఓనరు ...
అలా రోజు జిం లో చేసే ఎక్సర్సైజు లు నాలుగు రోడ్డు మీద చేసాక పాట అయిపోతుంది.
పాట అయిపోగానే బాగా గుబురు గెడ్డం, మాసిన జుట్టు వున్న పది మంది 'ఒరియా 'రౌడీ లు వచ్చి వెంటనే ఆ ప్లేస్ ఖాళీ చేయమని 'ఈనాడు ఎడిటోరియల్ ' లో వ్రాసే తెలుగు భాష లో హీరో కి వార్నింగ్ ఇస్తారు. వెంటనే ఏ మాత్రం ప్రతిఘటించకుండా హీరో సామాను సర్దుకుంటుంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చి 'ఏం వాళ్ళకు భయపడుతున్నావా, వాళ్ళని ఎదిరించే దమ్ము నీకు లేదా, వొంటి మీద కండలు కాదు మనిషి కి కావలసింది, గుండెల్లో దమ్ము ' అని హీరో ని రెచ్చగొడుతుంది. అయితే హీరో ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ సామాను సర్దుకుంటుంటాడు. ఇంతలో హీరోయిన్ తన అంకుల్, పోలీసాఫీసర్ పట్నయక్ కి కాల్ చేస్తుంది. పట్నయక్ ని చూసి కొయ్యబారిన రౌడీలు క్షమించమని ఆయన కాళ్ళ మీద పడుతుంటే పట్నాయక్ మాత్రం వాళ్ళని వదిలించుకుని వచ్చి హీరో కాళ్ళ మీద పడతాడు. హీరోయిన్ షాక్.
'మీ లాంటి గొప్ప మనిషి...' అని సగం డైలాగు పైకి చెప్పి మిగిలిన సగం లోపల గొణుక్కుంటూ వెళ్ళిపోతాడు. రౌడీలు కూడా వెళ్ళిపోతారు.
హీరోయిన్ మాత్రం హీరో దగ్గరకి వచ్చి, 'నువ్వు మామూలోడివి అయివుండవు, నీకు గ్యారంటీగా ఫ్లాష్ బాక్ వుండే వుంటది, అది నాకు చెప్పు ' అని సతాయిస్తుంది. హీరో ఏమో అదేమీ లేదు అని చెప్పి తప్పించుకుందామని ట్రై చేస్తాడు. కానీ హీరోయిన్ నువ్వు మర్యాదగా ఫ్లాష్ బాక్ అయినా చెప్పు లేదా నా ఈ క్రింది ప్రశ్నలకి సమాధానం అయినా చెప్పు అని నిలదీస్తుంది.(రెండూ ఒకటే!!)
1. ఒరిస్సా ని గడగడలాడించే ఐ.పి.ఎస్. పట్నాయక్ నీ కాళ్ళకి ఎందుకు దణ్ణం పెట్టాడు.
2. నీ ఈ బిడ్డ కి తల్లి ఎవరు. ఆమె ని ఫ్లాష్ బాక్ లో ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపారో క్లుప్తం గా వివరించు.
3. నీ అసలు పేరు ఏంటి. నీకు సెబాస్టియన్ అనే పేరు ఎందుకు కలిగింది.
కట్ చేస్తే కొండ మీద హీరో హీరోయిన్. బ్యాక్ డ్రాప్ లో ఎగిరి వచ్చే అలలు.
ఫ్లాష్ బాక్ స్టార్ట్:
హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఫ్యాక్షనిస్ట్ విలన్స్ చంపేస్తే ఏడేళ్ళ 'శివయ్య నాయుడు ' మాత్రం తప్పించుకుని ఏదో ట్రైన్ ఎక్కి ముంబై పారిపోతాడు. అక్కడ పెరిగి 20 ఏళ్ళయాక ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఒక సాంగ్ కూడా అయాక తెలుస్తుంది ఆ అమ్మాయిది కూడా 'సీమ ' యేనని. సీమ లో ఫ్యాక్షనిస్ట్ ఓబుల్ రెడ్డి (అవును ఓబుల్ రెడ్డి యే) ఆమె మీద కన్నేసి ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తే ఆమె తప్పించుకుని ముంబై వచ్చి వుంటుంది. వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుందామనుకునే టైం కి ఆ అమ్మాయిని ఓబుల్ రెడ్డి కిడ్నాప్ చేసి సీమ కి ఎత్తుకెళతాడు. ఆ అమ్మాయి కోసం హీరో సీమ లోకి ఎంటర్.
హీరో ట్రైన్ దిగి వూళ్ళోకి రాగానే అందరూ ఆశ్చర్యంగా ఆనందం గా వింత గా హీరో నే చూస్తూ వుంటారు. ఇంతలో ఒక ముసలావిడ పరుగెత్తుకుంటూ వచ్చి "శివయ్యా ఇంత కాలం ఏమయిపోయావయ్య, అచ్చు మీ నాన్న పోలికలే, ఎంతయినా మీ వంశమే వంశం, ఇంక మా కష్టాలన్నీ తీరిపోయాయి" అని ముందు డైలాగు కి వెనుక డైలాగు కి సంబంధం లేకుండా 5 నిమిషాలు ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఒక ముసలాయన వచ్చి " బాబూ నువ్వు ఏ నాటికైనా వస్తావని మాకు తెలుసు బాబూ, కాకపోతే నువ్వు ప్రొద్దున 7:30 రైలు కి వస్తావా, మధ్యాహ్నం 12:30 రైలు కి వస్తావా, రాత్రి 7:30 రైలుకి వస్తావా అని అందరం 20 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూనే వున్నాం బాబూ స్టేషన్ వైపు" అని కన్నీళ్ళ పర్యంతం అవుతుండగా, ఒక్క సారి గా వర్షం మొదలవుతుంది. వెంటనే పాట. ఓవరాల్ గా పాట కాన్సెప్ట్ ఏంటంటే -
'మన అన్న వచ్చేసాడు, ఇంక మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఇప్పట్నుంచీ వూళ్ళో వర్షాలు రెగ్యులర్ గా పడతాయి. పంటలు పండుతాయి. శత్రువుల గుండెల్లో గూడ్సు రైళ్ళు పరుగెడతాయి ' వగైరా వగైరా .
ఇక ఆ ఓబుల్ రెడ్డి తనవాళ్ళని చంపిన వాడి కొడుకే అని తెలియడం, హీరో వాణ్ణి చంపి హీరోయిన్ ని పెళ్ళి చేసుకోడం చకా చకా జరుగుతాయి.అప్పుడు ఒక 500 మంది ని వేసుకుని సుమోల్లో కత్తులు తిప్పుకుంటూ హీరో మీదకి విలన్ వస్తాడు అన్ని ఫ్యాక్షన్ సినిమాల లో మాదిరిగా. అయితే హీరో వాళ్ళ మీద కి కత్తో కొడవలో తీసుకుని పోవడం కాకుండా,(ఈ సారి వెరైటీ గా) తన బ్యాగ్ లో నుంచి ఒక మెషిన్ గన్ తీసుకుని టుపుక్ టుపుక్ అని కాల్చి అవతల పడేస్తాడు అందరినీ. నెక్స్ట్ సీన్ లో ఫ్యాక్షనిస్ట్ విలన్స్ అంతా సమావేశం అయి అసలు వీడి దగ్గరికి ఆ మెషిన్ గన్ ఎలా వచ్చింది. అసలు ఈ 20 ఏళ్ళు వీడు ఎక్కడున్నాడు ఏం చేసాడు అని సందేహించడం తో (ప్రేక్షకులకి రిలీఫ్ ని ఇచ్చే)
ఇంటర్వల్.
****
ఇంక వూరిలో వాళ్ళ సమస్యలు తీర్చి హీరో 'పెద్దోడు ' అవడం, హీరొ భార్య ప్రెగ్నెంట్ అవడం, ఒక పాట , జరుగుతాయి.ఒక సారి హీరో ఏదొ జోక్ చెబితే పక్కనే వున్న కమెడియన్ గట్టిగా నవ్వుతాడు. హీరో వాణ్ణి దగ్గరిగా పిలిచి బాగా పరిశీలించి అడుగుతాడు - రేయ్, నీ పళ్ళ మీద ఆ గార ఏంట్రా? అని. అప్పుడు కమెడియన్ కళ్ళళ్ళో నీళ్ళు సుడులు తిరుగుతాయి. హీరో ని వున్నఫళంగా బయటికి తీసుకెళతాడు. అక్కడి నీళ్ళు చూపిస్తూ అంటాడు- అయ్యా ప్రపంచం మొత్తం మంచి నీళ్ళూ తాగి దాహం తీర్చుకుంటుంటే సీమ లో మాత్రం ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్నాం అయ్యా ఫ్లోరైడ్ నీళ్ళు అని. అలాగే వూళ్ళోకి తీసుకెళ్ళి ఫ్లోరైడ్ నీళ్ళ వల్ల కీళ్ళు పట్టేసిన ముసలి వాళ్ళని, యూత్ లో నే రకరకాల అనారోగ్యాల పాలయిన యంగ్స్టర్స్ ని చూపిస్తాడు. అప్పుడు హీరో ఇన్నేళ్ళు గా సీమ వెనకబడిపోవడానికి కారణం ఫ్లోరైడ్ నీళ్ళే అని తీర్మానించేసి, నీళ్ళని శుభ్రపరచే ఒక పెద్ద ప్లాంట్ కట్టడం అనే ఒక మహాయఙ్ఞానికి శ్రీకారం చుడతాడు. ఇంక ఆ ప్లాంట్ కి విలన్స్ అడ్డు పడడం, హీరో వాళ్ళని ఎదిరించడం, ఇవన్నీ మమూలే . హీరో కూడాఈ ప్లాంట్ పని మీద కలెక్టర్ ని, హోం మినిస్టర్ ని, ఇంకా ఛీఫ్ మినిస్టర్ ని, గవర్నర్ ని, రాష్ట్రపతి నీ కలవడానికి ఢిల్లీ దాకా వెళతాడు. ఢిల్లీ వెళ్ళి పర్మిషన్ లు అన్నీ తెచ్చి ఇక పని మొదలెట్టే టైం కి సి.బి.ఐ, ఎఫ్.బి.ఐ, ఇంటర్-పోల్,స్కాట్లాండ్ పోలీస్, అందరూ వచ్చి హీరో ని 'యు ఆర్ అండర్ అరెస్ట్' అంటారు. 'బట్ వై' అంటుంది హీరో భార్య. "ఇతను మీ అందరికీ శివయ్య నాయుడి గానే తెలుసు. కానీ పోలీస్ ప్రపంచానికి ఇతనెవరో తెలుసా????? మాఫియా డాన్ 'షేక్'. ప్రపంచవ్యాప్త నెట్-వర్క్ కలిగిన డాన్ షేక్ ఇతనే" .
ఫ్లాష్ బాక్ లో ఫ్లాష్ బాక్:
7 ఏళ్ళ వయసు లో ముంబై వెళ్ళిన శివయ్య ముందు కూలీ గా, తర్వాత చిన్నమోస్తరు రౌడీ గా మారి అనుకోని పరిస్థితుల్లో డాన్ అవుతాడు. అయితే తన భార్య కి ఈ విషయం తెలీదు. మాఫియా డాన్ గా వుండి ముంబై స్లం లో వాళ్ళకి ఆయన చేసిన సేవ కార్యక్రమాలు, ఆయన మాఫియా వ్యవహారాలు, ముంబై లో తనకి ఆశ్రయం ఇచ్చిన ముస్లిం లీడర్ 'షేక్' అనే పేరు పెట్టడం వగైరా వగైరా మీరు ఈ సెకండ్ ఫ్లాష్ బాక్ లో చూస్తారు.
ఇక హీరో ని అరెస్ట్ చేసి తీసుకెళుతున్న పోలీసులకి చీఫ్ మినిస్టర్, ప్రైం మినిస్టర్, ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఫోన్ చేసి శివయ్య ని విడిచి పెట్టమని, శివయ్య ఆల్రెడీ ఈ విషయాలన్నీ తమతో చర్చించాడనీ, ఇప్పుడతనికి ఎలాంటి మాఫియా కనెక్షన్లు లేవనీ, పైగా ఇప్పుడతను చేస్తున్న మహా యఙ్ఞం వల్ల 4 జిల్లాలు బాగుపడతాయనీ చెప్పడం తో సి.బి.ఐ, ఎఫ్.బి.ఐ, ఇంటర్-పోల్ ఓ.కె. అంటారు. అయితే స్కాట్లాండ్ పోలీసులు ముందు కన్విన్స్ అవ్వరు. అప్పుడు ప్రైం మినిస్టర్ - 'ధర్మో రక్షితే రక్షితః' అన్న సామెతని ,దాని మీనింగ్ ని డిటెయిల్డ్ గా వివరించాక స్కాట్లాండ్ పోలీసులు కూడా కన్విన్స్ అయి వదిలేస్తారు. (ఆ ..మరిచి పోయా - అప్పుడు అక్కడున్న పోలీసుల్లో ఒకడే - తర్వాత ఐ.పి.ఎస్. అయిన పట్నాయక్).
అయితే హీరో వెనక్కి వెళ్ళేసరికే విలన్స్ ప్రెగ్నెంట్ గా వున్న హీరోయిన్ కడుపు లో క్యిబా క్యిబా అని తన్ని చంపేస్తారు. భార్య చనిపోయిందని హీరో, హీరో కి వంశాంకురం లేకుండా పోయిందని ప్రక్క వాళ్ళూ బాధ పడుతూ అంత్యక్రియలకి ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పుడే ఒక సెన్సేషనల్ సీన్ జరుగుతుంది.ఉన్నట్టుండి ఒక ముసలవిడ గట్టిగా అరుస్తుంది - 'పొట్ట కదులుతోంది రా' అని. ముసలోళ్ళంతా వచ్చి, చనిపోయిన హీరోయిన్ కడుపు ని కోసి, అందులోనుంచి బ్రతికి వున్న హీరో వంశాంకురాన్ని బయటికి తీస్తారు. బ్యాక్-డ్రాప్ లో "పులి బిడ్డ, సిం హం బిడ్డ, చావు ని ఎదిరించి పుట్టినోడు " ఆ టైప్ పాట.ఇంక హీరో - విలన్స్ లో దొరికినవాళ్ళందరినీ చంపేసి, భార్య ఙ్ఞాపకాలతో అకడ వుండలేక ఒరిస్సా కి (ఈ మధ్య ఒరిస్సా లో తెలుగు సినిమా ల కి మార్కెట్ బాగుంది) వెళ్ళి అక్కడ జిం పెట్టుకుంటాడు.
ఇంక క్లైమాక్స్ ఏముందీ, బ్యాలన్స్ మిగిలిన ఒక ఫ్యాక్షనిస్ట్ విలన్ వచ్చి హీరో కొడుకు ని సీమ కి ఎత్తుకెళితే హీరో మళ్ళీ సీమ కి వెళ్ళి మళ్ళీ ఫైట్ చేసి విలన్ ని చంపి, ఇంక ఫ్యాక్షన్ వద్దు. వయొలెన్స్ వద్దు. అహింసా పరమో ధర్మః, ధర్మో రక్షితే రక్షితః అని మెసేజ్ ఇచ్చి, సెకండ్ హీరోయిన్ ని చేసుకోడం తో కథ ముగుస్తుంది.
********************
ఉపసంహారం
మా డిస్కషన్స్ ఇలా జోరుగా సాగుతుండగా దఢేల్ మని తలుపు తెరుచుకుని వచ్చాడు మా క్లాస్మేట్ - 'ఏంటి బాసూ సీరియస్ డిస్కషన్స్?? ' అంటూ.'ఏం లేదు రా. ఫ్యాక్షన్ సినిమా కథ ఒకటి వండుతున్నాం - షేక్ సెబాస్టియన్ నాయుడు అని టైటిల్.'
టైటిల్ తప్ప ఒక్క ముఖ్ఖ ఎక్స్ ట్రా చెప్పకుండానే మా వాడికి స్టొరీ మొత్తం అర్థం అయిపోయింది-
'సీమ సబ్జెక్ట్ లో మత సామరస్యం మెసేజ్. గుడ్. సో రెండు ఫ్లాష్ బాక్ లన్న మాట.కథ కి మరింత పరిపూర్ణత్వం రావడానికి ఒక చిన్న సజెషన్. '
'చెప్పు ' అన్నాం.
'ఇంకో రెండు చిన్న ఫ్లాష్ బాక్ లు చెబుతా. చెరొక 4 నిమిషాలు వుంటాయి.సినిమా లో మీ బుద్ది పుట్టిన చోట వాటిని యాడ్ చేయొచ్చు. ' అని ఆ రెండు ఫ్లాష్ బాక్ లు చెప్పి వాటికి తగ్గట్టు టైటిల్ కూడా లైట్ గా మార్చి వెళ్ళిపోయాడు. వాడు చెప్పిన ఫ్లాష్ బాక్ లు ఏంటి అనేది మీ ఊహ కే (విఙ్ఞత కే ) వదిలేస్తున్నా. వాడు ఫైనల్ గా చెప్పిన టైటిల్ ఇది.
'షేక్ సెబాస్టియన్ నాయుడు సింగ్ దలైలామా'
పండగ చేసుకోండి.(క్రిస్మస్, జనవరి 1st తర్వాత సంక్రాంతి)
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
చాల నవ్వు వచ్చింది కథ చదివినంతసేపు.నేను కూద ప్రతి ఒక్కడూ ఇండస్ట్రీ హిట్ అన్న సినిమాలు చూసి చావు తప్పి కన్ను లొట్ట పోయి బయటపడిన రోజులు గుర్తు వచ్చాయి.
తెలుగు బ్లాగ్లోకంలో మరొక నవ్వుల తోట రూపుదిద్దుకుంటోందా?
అభినందనలు.
రామ కృష్ణ గారూ & కొత్త పాళీ గారూ,
మీ అభినందనలకు కృతఙ్ఞతలు
మీరు సినిమా తీస్తే నాకు తెలియజేయండి,
తప్పకుండా దాన్ని చూడకుండా జాగ్రత్త పడతా.
రమ్య గారూ, ఎన్నో 'కళాఖండ-ఖండాలని' ఇండస్ట్రీ హిట్ చేసిన ప్రేక్షకదేవుళ్ళు మీరు. మాబోటి 'వర్ధమాన కళాకారుల(?)' మీద శీతకన్ను వేయడం సబబు కాదు....
బాగుంది. ముసలాయన డవిలాగు హై లైట్. :-)
Mohan superrrr... preksakulaku relief niche interval... so good , chala comedy ga vundi :-)
Venkat Reddy
keka, uncomparable HIT
Post a Comment